మోదీ పర్యటనకు బహుళంచెల భద్రత

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం బహుళంచెల భద్రత కల్పించనుంది. భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో భాజపా ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ,

Published : 24 Jun 2022 05:36 IST

 పరేడ్‌ మైదానం సమీపంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు

బహిరంగ సభకు పాసులున్నవారికే అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం బహుళంచెల భద్రత కల్పించనుంది. భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో భాజపా ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, రవాణా, సైన్యాధికారులతో నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2, 3 తేదీల్లో హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరగనున్నాయి. 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లకు రూఫ్‌టాప్‌, మఫ్టీ పార్టీలు, రూట్‌ బందోబస్తు, సత్వర స్పందన దళాలను ఉపయోగించనున్నట్లు సీపీ వివరించారు. బహిరంగ సభకు హాజరయ్యేవారికి పరేడ్‌ మైదానం పరిసర ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పాసులున్నవారినే సభా ప్రాంగణం లోపలికి అనుమతించనున్నామని స్పష్టంచేశారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు ఏఆర్‌ శ్రీనివాస్‌, ఎం.రమేష్‌రెడ్డి, ఏవీ రంగనాథ్‌, కార్తికేయ, ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, జోయల్‌ డేవిస్‌, కంటోన్మెంట్‌ సీఈవో డి.అనితారెడ్డి, ఏవోసీ సెంటర్‌ కర్నల్‌ సంజీవ్‌కుమార్‌, ఎయిర్‌పోర్ట్‌ సీఎస్‌వో ఎం.శివయ్య, ఇతర ప్రభుత్వ అధికారులు, భాజపా నాయకులు రామ్‌చందర్‌రావు, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమన్వయ కమిటీ..

* ప్రధాని రాక, బస, బయలుదేరే సమయాలు, ఇతర అంశాలపై భాజపా ప్రతినిధులు, పోలీస్‌ అధికారులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తారు. ప్రధాని పర్యటన, కార్యక్రమాల్లో చివరి నిమిషంలో ఏవైనా మార్పులు, చేర్పులు అవసరమైతే కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.

* బహిరంగ సభకు వచ్చే ప్రముఖులు, నాయకులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు మైదానాలను కేటాయించాలని కంటోన్మెంట్‌ అధికారులను ట్రాఫిక్‌ అధికారులు కోరారు.

* విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని, అనివార్య కారణాల వల్ల సరఫరా నిలిచిపోతే వాడుకునేందుకు జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని భాజపా నేతలకు విద్యుత్తుశాఖ అధికారులు సూచించారు.

* బాంబునిర్వీర్య దళాలు, స్నిఫర్‌డాగ్స్‌ బృందాలు బహిరంగ సభ వేదిక వద్దే ఉంటాయి. వీటి సమన్వయానికి యాక్సెస్‌ కంట్రోల్‌ బృందం ఉంటుంది. వీవీఐపీల భద్రత, రక్షణ చర్యలను ఈ బృందం చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని