అండగా ఉంటారనుకుంటే.. ఆగమయ్యారు

ఉద్యోగం సాధించి పూరిగుడిసెలో ఉన్న కుటుంబ అభివృద్ధికి దోహదపడతాడని ఆశ కొందరిది.. కొలువు సాధిస్తే తమకు ఆదరవవుతాడనే ఆలోచన మరొకరిది. దాదాపు ఇలాంటి నేపథ్యమున్న కుటుంబాలకు చెందిన యువకులు ఆవేశంలోనో, ఇతరుల

Updated : 24 Jun 2022 08:16 IST

 జీవితంలో స్థిరపడే సమయంలో జైలుపాలు

‘సికింద్రాబాద్‌ విధ్వంసం’ నిందితుల కుటుంబాల్లో ఆందోళన

ఈనాడు - హైదరాబాద్‌

ఉద్యోగం సాధించి పూరిగుడిసెలో ఉన్న కుటుంబ అభివృద్ధికి దోహదపడతాడని ఆశ కొందరిది.. కొలువు సాధిస్తే తమకు ఆదరవవుతాడనే ఆలోచన మరొకరిది. దాదాపు ఇలాంటి నేపథ్యమున్న కుటుంబాలకు చెందిన యువకులు ఆవేశంలోనో, ఇతరుల ప్రోద్బలంతోనే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో నిందితులుగా మారారు. విధ్వంసంలో పాల్గొనకపోయినా.. నిరసన తెలపాలనుకుని వెళ్లి కొందరు, ఘటనా స్థలంలో సెల్ఫీలు తీసుకుని మరికొందరు కేసుల్లో ఇరుక్కున్నారు. వారిలో ఎక్కువ మంది తండాలు, మారుమూల పల్లెల్లోని నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఆయా కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. బెయిలుకు వీల్లేని సెక్షన్ల కింద కటకటాల పాలైన తమ బిడ్డలను తలచుకుని కుమిలిపోతున్నారు. జైల్లో ఉన్న వారిని విడిపించుకోవాలనే ప్రయత్నాల్లో కొందరు ఉండగా, రెక్కాడితేగాని డొక్కాడని కొన్ని కుటుంబాలు ఆ ప్రయత్నాలూ చేయడం లేదు.


బిడ్డ జైల్లో.. నిరాశలో కుటుంబం

చిత్రంలో కనిపిస్తున్నది రైల్వే విధ్వంసం ఘటనలో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న దేవ్‌సోత్‌ సంతోష్‌ కుటుంబం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతుసంగం కుగ్రామంలో నివసిస్తున్న ఈ కుటుంబంలో పదో తరగతి కంటే ఎక్కువ చదివింది సంతోష్‌ ఒక్కడే. ఉద్యోగం సాధించి ఆసరాగా ఉంటాడనుకున్న బిడ్డ ఈ కేసులో చిక్కుకోవడం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యులను నిరాశలోకి నెట్టింది. ‘పరీక్ష ఉందంటూ పది రోజుల క్రితం వచ్చిన తమ్ముడు జైలుకెళ్లాడు. ఇప్పటివరకు వాణ్ని కలవలేదు. ఎలా వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియడం లేదు’ అని సంతోష్‌ సోదరుడు సక్రూ వాపోయాడు.


ఊరి సాయంతో శిక్షణ తీసుకొని ఊచల్లోకి..

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు కుమ్మరితండాకు చెందిన మరో నిందితుడు పడ్వల్‌ యోగేశ్‌కు చెందిన నిరుపేద కుటుంబమిది. తండ్రి లారీ డ్రైవర్‌, అన్న క్లీనర్‌. తల్లి, సోదరి కూలీపనులకు వెళ్తుంటారు. ఇందిరమ్మ పథకం కింద కట్టుకున్న ఇల్లు, అర ఎకరం భూమే ఆ కుటుంబానికి ఆధారం. ఆదిలాబాద్‌లో డిగ్రీ చదివిన యోగేశ్‌ ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకున్నాడు. ‘శిక్షణ కోసం రూ.20 వేలు అవసరమైంది. ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఊరంతా కలిసి రూ.10 వేలు సమకూర్చాం. ఉద్యోగంలో చేరి సోదరి పెళ్లికి సాయం చేస్తాడనుకుంటే ఇలా జైలుపాలయ్యాడు’ అని  గ్రామస్థులు తెలిపారు.


ఇంటికి రాలేదు.. జాడ తెలియలేదు

రైల్వేస్టేషన్‌ విధ్వంసం సమయంలో రెండు వేల మంది యువకులున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు పలు అంశాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తుండటంతోపాటు సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వారినీ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టయిన వారి ఫోన్లలోని వాట్సప్‌ సందేశాలను పరిశీలిస్తూ మిగిలిన వారిని గుర్తిస్తున్నారు. ఇలా ఈ కేసులో ఇప్పటివరకు 63 మందిని నిందితులుగా చేర్చి 55 మందిని అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో విధ్వంసం సమయంలో రైల్వేస్టేషన్‌లో ఉన్న యువకుల్లో పలువురి ఆచూకీ తెలియకుండా పోయింది. అరెస్టుల భయంతో అలాంటి వాళ్లంతా సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేయడంతో బిడ్డల జాడ తెలియని కుటుంబ సభ్యులు జీఆర్‌పీ స్టేషన్‌, రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌, చంచల్‌గూడ జైలు వద్దకు పరుగులు పెడుతున్నారు. తమ బిడ్డ ఎక్కడున్నాడో చెప్పాలంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతూ అక్కడే పడిగాపులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని