వానాకాలం లక్ష్యం 52 లక్షల ఎకరాలు

ప్రస్తుత వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులు, ఎత్తిపోతలు.. ఇలా అన్ని సాగునీటి వనరుల కింద 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల

Published : 24 Jun 2022 05:36 IST

 ఆరుతడి పంటలు 19.80 లక్షలు

వరిసాగు 32.20 లక్షలు

జులైలో నీటి విడుదల ప్రారంభం

నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయం

ఈనాడు హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులు, ఎత్తిపోతలు.. ఇలా అన్ని సాగునీటి వనరుల కింద 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రతిపాదించారు. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 38 లక్షల ఎకరాలు కాగా, మిగిలింది చెరువులు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద ఉంది. కాళేశ్వరం, శ్రీరామసాగర్‌, దేవాదుల, కల్వకుర్తి, భీమా ఇలా అనేక ప్రాజెక్టుల కింద చెరువులను నింపి నీటిని అందించనున్నారు. ఇందులో ఆయకట్టు పరిధిలోనే కాకుండా దాని బయట కూడా చెరువులు ఉండడంతో వాటి కిందనే 97.80 టీఎంసీలతో 11.30 లక్షల ఎకరాలను ప్రతిపాదించారు. వానాకాలంలో ప్రతిపాదిత ఆయకట్టుకు 506.25 టీఎంసీల నీరు అవసరమని అంచనా వేశారు. మొత్తం ఆయకట్టులో 32.20 లక్షల ఎకరాల్లో వరి కాగా, మిగిలినవి ఆరుతడి పంటలు. ఈ మేరకు అన్ని జిల్లాల చీఫ్‌ ఇంజినీర్లు ఇచ్చిన ప్రతిపాదనలపై సమీకృత సాగునీటి యాజమాన్యం, నిర్వహణకు సంబధించిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఎన్‌సీలు శంకర్‌, నాగేందర్‌రావు, వెంకటేశ్వర్లు, అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లు, పలువురు ఎస్‌ఈలు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, ఆయకట్టు సాగు, ప్రాజెక్టుల నుంచి చెరువులు నింపి ఆయకట్టుకు నీళ్లివ్వడం తదితర అంశాలపై వివరంగా చర్చించారు. జులైలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించాలని, ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ప్రవాహాలను పరిగణనలోకి తీసుకొని తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీరామసాగర్‌, శ్రీరామసాగర్‌ రెండోదశ, నాగార్జునసాగర్‌, ఎ.ఎం.ఆర్‌.పి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, నిజాంసాగర్‌, జూరాల తదితర ప్రాజెక్టుల కింద అత్యధిక ఆయకట్టుకు నీరందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 57,600 ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు 5.75 టీఎంసీలు అవసరమని అంచనా వేశారు. దీంతోపాటు ఆయకట్టు పరిధిలోనూ, దాని బయట 24 టీఎంసీలతో 6,200 చెరువులను నింపి 2.3 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌, భీమా, కల్వకుర్తి.. ఇలా అన్ని ప్రాజెక్టుల కింద అత్యధికంగా చెరువులను నింపి నీటిని సరఫరా చేయనున్నారు. కాలువలకు నీటిని విడుదల చేసే ముందుగా మరమ్మతు పనులు ఏమైనా ఉంటే పూర్తి చేయాలని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ సూచించారు. సమావేశంలో చర్చించిన అంశాలతో ప్రతిపాదనను నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి పంపనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని