సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మకు ఘన వీడ్కోలు

దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మకు గురువారం ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా నియమితులైన జస్టిస్‌ ఉజ్జల్‌

Published : 24 Jun 2022 05:36 IST

హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా 28న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మకు గురువారం ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా నియమితులైన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఈ నెల 28న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ మాట్లాడుతూ.. ధర్మ మార్గాన్ని అనుసరించాలని, అప్పుడే సమాజానికి న్యాయం చేయగలమని అన్నారు. న్యాయవాది.. వాస్తవాలను వెలికి తీసే డిటెక్టివ్‌లా, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే రైతులా, కచ్చితత్వంతో శస్త్రచికిత్స చేసే వైద్యునిలా ఉండాలన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కొత్త రెవెన్యూ జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటయ్యాయని జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ తెలిపారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కృషి ఫలితంగా న్యాయమూర్తుల నియామకాలు పెరిగాయన్నారు. అంతేగాకుండా ఐఏఎంసీ ఏర్పాటైందని, దానికి పునాది వేయడంలో తాను భాగస్వామిని అయిన విషయాన్ని గుర్తుచేశారు. అంతకుముందు అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లు మాట్లాడుతూ.. జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ న్యాయవ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీజే సతీమణి మీతాశర్మ, కుమారులు సిద్ధార్థశర్మ, శాంతను శర్మలతోపాటు న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం బార్‌ అసోసియేషన్‌లో అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ నేతృత్వంలో ఉపాధ్యక్షుడు మహ్మద్‌ ముంతాజ్‌ పాషా, కార్యదర్శులు కల్యాణ్‌రావు, సృజన్‌కుమార్‌రెడ్డి ఇతర కార్యవర్గం పాల్గొని జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ దంపతులను ఘనంగా సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని