ఆంగ్ల మాధ్యమంలో తరగతులకు అడ్డంకులు

రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు తరగతుల్ని ఆంగ్లమాధ్యమంలోకి మార్చిన ప్రభుత్వం.. టీచర్లకు శిక్షణ పూర్తిచేయలేదు

Published : 24 Jun 2022 05:36 IST

గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల మాధ్యమిక టీచర్లకు మొదలుకాని శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు తరగతుల్ని ఆంగ్లమాధ్యమంలోకి మార్చిన ప్రభుత్వం.. టీచర్లకు శిక్షణ పూర్తిచేయలేదు. సబ్జెక్టు టీచర్లకు ఆంగ్లభాషలో బోధనకు వీలుగా అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం సహకారంతో నిర్వహిస్తున్న ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ కోర్సు (ఈఎల్‌ఈసీ) తరగతులు ఆలస్యంగా ప్రారంభించడంతో విద్యాసంవత్సరం మొదలైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాథమిక తరగతుల టీచర్లకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు కొనసాగుతుండగా 6, 7, 8 తరగతుల ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం కాలేదు.

పదోతరగతి పరీక్షలతోనే..

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని 1,423 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరం తెలుగు మీడియంలో కొనసాగుతున్న పాఠశాలల్లోని 1-8 వరకు తరగతుల్ని ఆంగ్లమాధ్యమంలో బోధించాలని నిర్ణయించడంతో ఆ మేరకు టీచర్లకు గిరిజన సంక్షేమశాఖ శిక్షణ తరగతులు ప్రారంభించింది. తొమ్మిది వారాల ఈఎల్‌ఈసీ కోర్సులో రెండు వారాలు ప్రత్యక్ష, ఏడు వారాలు ఆన్‌లైన్‌లో తరగతులకు ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక తరగతులకు బోధించే టీచర్లకు ప్రత్యక్ష శిక్షణ పూర్తవగా ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులు ముగిసి బడులు తెరుచుకోవడంతో బోధనకు ఇబ్బందులు లేకుండా సెలవు రోజులు, ప్రత్యేక దినాల్లో తరగతులు నిర్వహిస్తోంది. ఇవి పూర్తయ్యేందుకు రెండు నెలలకుపైగా సమయం పట్టే అవకాశమున్నట్లు సమాచారం. 6, 7, 8 తరగతులు బోధించే మాధ్యమిక టీచర్లకు శిక్షణ మొదలు పెట్టే సమయానికి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో తరగతులు జరగలేదు. వీరికి ప్రత్యక్ష, పరోక్ష తరగతులు బోధించేందుకు వీలుగా టైంటేబుల్‌ సిద్ధం చేసేందుకు యూనివర్సిటీతో సంక్షేమశాఖ చర్చిస్తోంది.

పుస్తకాలు వచ్చేవరకు బ్రిడ్జ్‌ కోర్సు

గిరిజన పాఠశాలల్లో 1-8 వరకు పుస్తకాలు వచ్చేవరకు బ్రిడ్జ్‌ కోర్సు కొనసాగించాలని గిరిజన శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీడీఏ భద్రాచలం పీవో ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను బోధించనుంది. అధ్యాయాల వారీగా ఆ కోర్సు సాఫ్ట్‌ కాపీలను పాఠశాలలకు పంపించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని ప్రింట్‌ తీసి అందించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని