ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధాన మార్గాలు!

అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు, ప్రాంతీయ రింగ్‌ రోడ్డుకు మధ్య అనుసంధాన మార్గాలకు రూపకల్పన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నుంచి

Updated : 24 Jun 2022 10:25 IST

స్పైక్‌ రోడ్స్‌ నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు, ప్రాంతీయ రింగ్‌ రోడ్డుకు మధ్య అనుసంధాన మార్గాలకు రూపకల్పన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నుంచి సుమారు 30 కిలోమీటర్ల అవతల ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను రెండు భాగాలుగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగం నిర్మాణానికి వీలుగా భూసేకరణ కసరత్తు జరుగుతోంది. దాని నిర్మాణం చేపట్టేనాటికి అనుసంధాన మార్గాలు(స్పైక్‌ రోడ్స్‌)కు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో జంక్షన్లను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఆయా జంక్షన్లకు ఈ అనుసంధాన మార్గాలను లింకు రోడ్లుగా వేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. అనుసంధాన మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. సుమారు 50 వరకు అనుసంధాన మార్గాలను నిర్మించాల్సి ఉంటుందని అంచనా. 275 నుంచి 300 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మించాలి. వీటి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల వరకు వ్యయమవుతుందన్నది పాథమిక అంచనా. ఆయా వ్యవహారాలను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సవివర నివేదిక తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు కీలక మార్గాల మధ్య అనుసంధానం ద్వారా మధ్యలోని 30 కిలోమీటర్ల దూరంలో వివిధ రంగాల అభివృద్ధికి అవకాశం కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. హైదరాబాద్‌ నగర శివార్లలో భవిష్యత్తులో నిర్మించే ట్రక్‌ పార్కులు, ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్స్‌ నుంచి రాకపోకలు సాగించేవారికీ ఈ అనుసంధాన మార్గాలు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం చేసేందుకు ముత్తంగి జంక్షన్‌ నుంచి రుద్రారం మీదుట కౌలంపేట వరకు, అంబర్‌పేట జంక్షన్‌ నుంచి అబ్దుల్లాపూర్‌, తూరాన్‌పేట మీదుగా మల్కాపూర్‌ వరకు, బాచారం జంక్షన్‌ నుంచి బండ్ల రావిర్యాల, జూలూరు నుంచి రావల్‌పల్లి వరకు, కీసర జంక్షన్‌ నుంచి కీసర రంగాపూర్‌ మీదుగా గుడూరు వరకు, శామీర్‌పేట నుంచి సంపన్‌బోలె, అనందారం మీదుగా అలియాబాద్‌ వరకు ఇలా 50 మార్గాలను నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు