జడలు విప్పుతున్న కంఠసర్పి!

కొవిడ్‌ నేపథ్యంలో చాలామంది చిన్నారులు టీకాలకు దూరంగా ఉండిపోవడంతో ఇప్పుడా ప్రభావం కనిపిస్తోంది. తాజాగా నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) కేసులు పెరగడానికి ఇది కూడా కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Updated : 24 Jun 2022 05:45 IST

టీకాలకు పిల్లలు దూరమవడమే కారణం

పది రోజుల్లో 60కి పైగా కేసులు

ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌ నేపథ్యంలో చాలామంది చిన్నారులు టీకాలకు దూరంగా ఉండిపోవడంతో ఇప్పుడా ప్రభావం కనిపిస్తోంది. తాజాగా నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) కేసులు పెరగడానికి ఇది కూడా కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి నిత్యం పదిమందికి పైనే చిన్నారులు కంఠసర్పితో చికిత్స కోసం వస్తున్నారు. పదిరోజుల్లో ఈ ఒక్క ఆసుపత్రిలోనే 60కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. నగరంలో ప్రైవేటు ఆసుపత్రులనూ లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని అంటున్నారు.

ఏమిటీ వ్యాధి..?

* సాధారణంగా 0-10 ఏళ్ల వయసు పిల్లలను ఎక్కువగా కంఠసర్పి(డిఫ్తీరియా) సోకుతుంది. బ్యాక్టీరియా ప్రభావంతో ఈ వ్యాధి బారినపడిన వ్యక్తి దగ్గినప్పుడు గాలిద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

* తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి, గొంతులో తెల్లని పొర ఏర్పడతాయి. శ్వాస కష్టమవుతుంది. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవాలి.  నిర్లక్ష్యం చేస్తే గుండెకండరాలు, నరాల వాపు, మూత్రపిండాల సమస్యలు, పక్షవాతం తదితర సమస్యలకు దారితీస్తుంది.

* నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా పిల్లలకు సకాలంలో టీకాలు ఇప్పించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టీకాలపై కొవిడ్‌ ప్రభావం

జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం కింద డిఫ్తీరియాకు ప్రభుత్వమే ఉచితంగా టీకాలు అందజేస్తోంది. డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం..ఈ మూడూ సోకకుండా డీపీటీ పేరుతో టీకాను శిశువు పుట్టిన మూడున్నర నెలల వ్యవధిలో మూడు డోసులు ఇస్తారు. 18నెలలు, 5ఏళ్ల వయసులో మరో రెండు డోసులు అందిస్తారు. పదో ఏట బూస్టర్‌ డోసు ఇస్తారు. తల్లిదండ్రుల్లో అవగాహన లేక చాలామంది పిల్లలు సకాలంలో టీకాలకు నోచుకోవడం లేదు. కొందరికి ఒకటి,రెండు డోసులు ఇప్పించి ఊరుకుంటున్నారు. మరోవైపు కరోనా.. టీకాల కార్యక్రమంపై తీవ్ర ప్రభావం చూపింది. అనేకమందికి టీకాలు అందలేదు. ఫలితంగా పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గి కంఠసర్పి సోకుతోంది. వానాకాలం ఈ బ్యాక్టీరియా విస్తరణకు అనుకూలం. కొన్నిసార్లు వ్యాధి లక్షణాలు కనిపించినా చాలామందికి అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాధి ముదిరాక ఆసుపత్రులకు తీసుకొస్తుండటంతో పరిస్థితి చేయిదాటి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు తెలిపారు.

నిర్లక్ష్యం పనికిరాదు

నిర్ణీత గడువులోపు పిల్లలకు టీకా డోసులు ఇవ్వాలని, నిర్లక్ష్యం పనికిరాదని గాంధీ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ సుచిత్ర తెలిపారు. కొవిడ్‌ ఇతర కారణాలతో మొదటి సంవత్సరంలో ఏవైనా టీకాలు ఇవ్వకపోతే వైద్యుల సూచనలతో చిన్నారులకు రెండో ఏడాది పూర్తయ్యేలోపు అందించాలన్నారు. కంఠసర్పిని ముందే గుర్తిస్తే చికిత్స చేయవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని