Published : 25 Jun 2022 03:08 IST

రెడ్డి కార్పొరేషన్‌ హామీ నెరవేరేలా చూస్తా

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
పేదరికం ఒక కులానికో.. మతానికో పరిమితం కాదు
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల : ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటుకు ఇచ్చిన హామీ వాస్తవమేనని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కరోనాతో రెండేళ్లుగా దీనిపై జాప్యం జరుగుతూ వస్తోందన్నారు. రెడ్డి కార్పొరేషన్‌ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో హామీ నెరవేర్చేలా చూస్తామన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి శుక్రవారం పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని బీసీ కులాల బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.‘‘నాకు కుల, మతాలపై పెద్దగా అవగాహన లేదు. నేను చదివి.. ఉద్యోగం చేసింది హైదరాబాద్‌, అమెరికాలాంటి ప్రాంతాల్లో.. నా దృష్టిలో కులమంటే అభివృద్ధి.. మతమంటే సంక్షేమం. పేదరికం ఒక కులానికో.. మతానికో పరిమితమైంది కాదు. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉంది. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రెడ్లలోనూ పేదలున్నారు. ఒకసారి ముస్తాబాద్‌ మండలం బందనకల్‌లో రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లా. వాళ్లది దయనీయ పరిస్థితి. ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు నాతో మాట్లాడుతూ..తాము పేరుకు అగ్రకులం వాళ్లమే కావచ్చు.. కుటుంబానికి ఒక పింఛను ఇప్పించి.. పిల్లలకు వసతి గృహంలో సీటు ఇప్పిస్తేనే వీరికి భవిష్యత్తు అని చెప్పారు. ఆ కుటుంబ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లా. అందుకే నేడు రాష్ట్రంలో కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతోన్నాయి. అర్హులైన నిరుపేదలందరికీ న్యాయం జరగాలని పథకాలు రూపకల్పన చేశాం. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో అమలు కాని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబిడ్డగా చేసి చూపిస్తున్నారు. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తాం’ అని చెప్పారు.


సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన

మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. దీనికి నిరసనగా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు.  మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేశారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి ఆరోపించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని