Updated : 25 Jun 2022 05:55 IST

సంక్షిప్త వార్తలు

ఇంటర్‌ ఫలితాల విడుదలపై సీఎస్‌ ఆరా
తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు!

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ ఫలితాల వెల్లడిపై రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వాటిలో తప్పులు దొర్లితే సమస్యలు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం అందుకు సరిపడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ పూర్తి వివరాలను తెప్పించుకుని ఫలితాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. సీఎస్‌ ఆయా వివరాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. సీఎం ఆమోదం తెలపగానే ఫలితాలను వెల్లడించనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. ఈసారి 60 శాతానికి పైగానే ఉత్తీర్ణత శాతం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


27 నుంచి పాఠ్యపుస్తకాల విక్రయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలు ఈ నెల 27 నుంచి ఆయా పుస్తక దుకాణాల్లో విక్రయానికి అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. డీఈవోలు ఆమోదించిన దుకాణాల్లోనే 1-10 తరగతుల పుస్తకాలను విక్రయిస్తారని పేర్కొన్నారు. ‘‘మొత్తం 13 సంస్థలకు 1.22 కోట్ల పుస్తకాల ముద్రణను అప్పగించాం. ప్రతి సబ్జెక్టు, ప్రతి అధ్యాయంలో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాం. వాటిని స్కానింగ్‌ చేసి ఆడియో, వీడియోల రూపంలో మరింత సమాచారం పొందొచ్చు’’ అని ఆయన వివరించారు.


ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: మత్స్యకారుల కులాలకు సంబంధించి మార్చి 3న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హాకు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జీవో 98 ప్రకారం 29 తెగల్లో ముత్రాసి, ముదిరాజ్‌ ఉన్నాయంటూ మత్స్యశాఖ కమిషనర్‌ 2019 ఇచ్చిన సిఫారసులపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ మార్చిలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి అమలు చేయకపోవడంతో వరంగల్‌కు చెందిన రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రావుల జగదీశ్వర్‌ప్రసాద్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డి.ఎల్‌.పాండు వాదనలు వినిపిస్తూ 2019లో జీవో 98లో పేర్కొన్నవాటిలో ముత్రాసి, ముదిరాజ్‌లు ఉన్నాయంటూ మత్స్యశాఖ కమిషనర్‌ ఇచ్చిన సిఫారసులను అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. దీనిపై న్యాయమూర్తి మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హాకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.


సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్‌ శైని బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) విభాగం డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి రజత్‌కుమార్‌ శైని బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చిన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి రెవెన్యూ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. గతంలోనూ ఆయన ఇదే స్థానంలో కొనసాగారు.


కిశోర్‌ వైజ్ఞానిక్‌ యోజన పోటీ పరీక్షలో నారాయణ విద్యాసంస్థల విజయ దుందుభి

నాగోలు, న్యూస్‌టుడే: జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏటా ప్లస్‌ 1, ప్లస్‌ 2 విద్యార్థులకు నిర్వహించే కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన పోటీ పరీక్షలో నారాయణ విద్యాసంస్థ విద్యార్థులు 172 మంది ఎంపికై విజయ దుందుభి మోగించారు. ఓపెన్‌ కేటగిరీలో 1, 2, 8 సహా 20 లోపు 9 ర్యాంకులు, 50 లోపు 15 ర్యాంకులు, 100 లోపు 25 ర్యాంకులు సాధించారు. పీడబ్ల్యూడీ విభాగంలోనూ ఆలిండియా మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ గ్రూప్‌ డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణలు విద్యార్థులను అభినందించారు.


వెబ్‌సైట్‌లను ప్రజలకు చేరువ చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలోని పురపాలికలు, నగరపాలక సంస్థలన్నీ ప్రజలు ఉపయోగించుకునేలా పట్టణ స్థానికసంస్థల వెబ్‌సైట్‌లను అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ల ద్వారా వివిధ పౌరసేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అధికారులకు సూచించారు.


జలాలపై సౌర విద్యుత్‌ కేంద్రం పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: జలాలపై కదిలే 92 మెగావాట్ల అతిపెద్ద సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణాన్ని కేరళలోని కయాంకుళంలో పూర్తిచేసినట్లు ఎన్టీపీసీ దక్షిణ భారత ప్రాంతీయ కార్వనిర్వాహక సంచాలకుడు నరేశ్‌ ఆనంద్‌ తెలిపారు. ఇందులోని 35 మెగావాట్ల కేంద్రంలో శుక్రవారం విద్యుదుత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారు.


జులై 20న తెలుగు వర్సిటీ స్నాతకోత్సవం

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం జులై 20న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యకు తెలుగు వర్సిటీ గౌరవ డిలిట్‌ను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గత నాలుగేళ్లలో విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రముఖుల పేరిట నెలకొల్పిన బంగారు పతకాలతో పాటు స్నాతకోత్సవ పట్టాలను గవర్నర్‌ ప్రదానం చేస్తారని తెలిపారు.


నైరుతి గాలులతో వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయం 8నుంచి శుక్రవారం రాత్రి8గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా సర్వాపూర్‌(కామారెడ్డి జిల్లా)లో 5.8, రాయికల్‌(జగిత్యాల)లో 5.5, వెంకట్రావుపేట(కుమురంభీం)లో 4.9, ఇచ్చోడ(ఆదిలాబాద్‌)లో 4.9, కడెంపెద్దూరు(నిర్మల్‌)లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని