మార్మిక మాటల గుట్టు విప్పారు!

దైపుడం.. కాశ్కం.. కిల్లుడు.. సాతలాలు.. సురంగాలు.. ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? చదివారా? ఇవి తెలుగు పదాలేనా అనే అనుమానం వస్తోంది కదూ. కొన్ని సంచార జాతుల ప్రజలు వాడే మాటలివి. వారు ఎక్కడా స్థిరంగా

Updated : 25 Jun 2022 05:48 IST

పరకాల డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రాజెక్టు
రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి

పరకాల, న్యూస్‌టుడే: దైపుడం.. కాశ్కం.. కిల్లుడు.. సాతలాలు.. సురంగాలు.. ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? చదివారా? ఇవి తెలుగు పదాలేనా అనే అనుమానం వస్తోంది కదూ. కొన్ని సంచార జాతుల ప్రజలు వాడే మాటలివి. వారు ఎక్కడా స్థిరంగా నివసించకపోవడం, లిపి లేకపోవడంతో అవి క్రమేణా కనుమరుగవుతున్నాయి. వీటిని వెలుగులోకి తెచ్చేందుకు హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మూడు నెలలపాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. దీనిపై 36 పేజీల నివేదిక తయారు చేసి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రదర్శించారు. దీనికి ప్రథమ బహుమతిగా రూ.30 వేల పారితోషికం, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

పరిశోధన సాగిందిలా..

దళితుల్లో ఉపకులాలైన డక్కలి, బుడగ జంగాలు (బేడ జంగాలు), మందులోళ్లు, చిందు (చిందులు) వంటి తెగల ప్రజలు మాట్లాడే భాషకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. వీరిలో మందులోళ్లు వనమూలికల మందులను తయారు చేసి.. ఊరూరా తిరిగి విక్రయిస్తుంటారు. మిగిలిన వారంతా వివిధ కళాప్రదర్శనలతో పొట్టపోసుకుంటారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు ఐలి కవిత, కట్టగాని విశ్వతేజ, బొమ్మ నాగలక్ష్మి, తిప్పర్తి సుమన్య, పొన్నాల అరవింద్‌ ఈ తెగల భాషలపై పరిశోధన ప్రాజెక్టు చేశారు. తెలుగు అధ్యాపకులు గజవెల్లి ఈశ్వర్‌ ఆధ్వర్యంలో వీరు పరకాల, కామారెడ్డిపల్లి, మల్లక్కపేట, నాగారం, నడికూడ మండలం నర్సక్కపల్లి, ధర్మారం, కంఠాత్మకూరుతోపాటు భూపాలపల్లి జిల్లా రేగొండలో పర్యటించారు. ఆయా కులాల ప్రజలతో మాట్లాడారు. వారు వాడే పదాలు, వాటి తెలుగు అర్థాలు, కులాల వారీగా వాటి మధ్య ఉన్న సారూప్యతలను తెలుసుకుని ప్రాజెక్టు నివేదిక రూపొందించారు.

మచ్చుకు కొన్ని పదాలు

ఆయా పదాలకు పై నాలుగు కులాల్లోనూ కొన్నిటికి ఒకే అర్థం, మరికొన్నిటికి వేర్వేరు అర్థాలుండడం విశేషం.

ఉదాహరణకు.. ‘దైపుడం’ అనే పదానికి కొట్టడం, కొట్టుకోవడం, రోకలిబండ వంటి అర్థాలున్నాయి. దయ్యం, కుక్క, పిల్లి... అనే అర్థంలో వివిధ కులాల వారు వాడే పదం ‘కాశ్కం’. ‘కిల్లుడు’.. అంటే నవ్వడం, పడుకున్నాడు అనే అర్థాలున్నాయి. పోలీసులను.. సురగపోడు, జిమాడలు, సురంగాలు అనే పదాలతో వ్యవహరిస్తారు. పగటివేషాల వారు దుస్తులను ‘సాతలాలు’ అంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని