Published : 25 Jun 2022 05:32 IST

రాజకీయంగా ఎదుర్కొందామా? కోర్టుకెళ్దామా?

‘ధాన్యం’పై మంత్రుల మథనం
కేంద్ర స్పందన కోసం ఎదురుచూపు
మంగళవారం తరవాత తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ‘మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని ఏమి చేద్దాం? టెండర్లు ఆహ్వానించి విక్రయించటమా? కేంద్ర వైఖరిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించటమా? కేంద్రం బియ్యం తీసుకొనేందుకు ముందుకొస్తే మిల్లర్లకు నష్టపరిహారం ఇచ్చి సాధారణ బియ్యంగా మార్చటమా? రాజకీయంగా పోరాడటమా?’ అనే కోణంలో రాష్ట్రప్రభుత్వం సమాలోచన జరుపుతోంది. కేంద్ర స్పందన కోసం మంగళవారం వరకు వేచి చూసి.. తరవాత ప్రత్యామ్నాయాలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వలు పేరుకుపోవటంతో ఏమి చేయాలన్న అంశంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు శుక్రవారం సుదీర్ఘంగా మేధోమథనం చేశారు. ఉచిత బియ్యం పంపిణీ చేయలేదన్న కారణంతో కేంద్రం బియ్యం సేకరణను ఈ నెల ఏడో తేదీనుంచి నిలుపుదల చేసింది. మరోపక్క గడిచిన రెండు సీజన్లకు సంబంధించి పెద్ద మొత్తంలో ధాన్యం నిలిచిపోయింది. కేంద్రం బియ్యం తీసుకోకపోతే ఏం చేయాలన్నది ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా వేలం వేస్తే ధాన్యం కొనుగోలుకు సిద్ధమంటూ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశాలపై ప్రధానంగా మంత్రులు చర్చించారు. వర్షాలకు తడిసిపోయే అవకాశమున్న చోట్ల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలా? ప్రత్యామ్నాయాలున్నాయా? అనేదానిపైనా చర్చలు జరిపారు.  

నెలకు రూ.110 కోట్ల వడ్డీ భారం

ప్రస్తుతం రాష్ట్రంలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. గడిచిన వానాకాలం, యాసంగిలో వడ్ల కొనుగోలుకు రూ.22 వేల కోట్లను పౌరసరఫరాల శాఖ ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని రుణంగా తీసుకోవడంతో నెలకు రూ.110 కోట్ల వడ్డీ భారం పడుతోంది. క్వింటా ధాన్యానికి రూ.1,960 చెల్లించినా.. కమిషన్‌, రవాణా, గోనె సంచులు ఇలా అన్నీ కలిపి రూ.2,200 దాకా ఖర్చు వచ్చింది. మిల్లుల వద్ద ఉన్న ధాన్యాన్ని వేలం వేయడం ద్వారా కొంతైనా ఉపశమనం కలుగుతుందేమోనని చర్చించారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో వేలం వేస్తున్నందున అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెప్పించి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

వేచి చూడటానికి కేంద్రం లేఖే కారణమా?

ఉచిత బియ్యం పంపిణీపై ఆరా తీస్తూ కేంద్రం నుంచి లేఖ వచ్చింది. నిలిపివేసిన బియ్యం సేకరణ పునరుద్ధరణకు ఈ లేఖ సంకేతమని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో బియ్యం సేకరణ ప్రారంభించాలనే వర్తమానం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం వరకు వేచి చూసిన తరవాత ప్రత్యామ్నాయాలపై మరోదఫా సమీక్షించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిస్థితులను వివరించాలని మంత్రులు నిర్ణయించారు. సోమవారం నాటికి పూర్తి వివరాలతో నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.


ఉచిత బియ్యం పంపిణీ చేశారా...?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం
ముమ్మరంగా ఇస్తున్నామంటూ ప్రత్యుత్తరం

ఈనాడు, హైదరాబాద్‌ : ఆహార భద్రతా పథకం కింద కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం తెలంగాణలో పంపిణీ చేస్తున్నారా? లేదా? చేస్తుంటే ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఇచ్చారు? తదితర వివరాలతో తక్షణం నివేదిక పంపాలని కేంద్రం గురువారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద కరోనా నేపథ్యంలో పేదలకు ఆరో దఫా కేంద్రం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఏప్రిల్‌, మే నెలల్లో పంపిణీ చేయలేదు. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) విచారణలో బియ్యం ఇవ్వటం లేదని స్పష్టమైంది. ఉచిత బియ్యం ఇవ్వని కారణంగా కస్టం మిల్లింగ్‌ రైస్‌ పథకం కింద రాష్ట్రం నుంచి తీసుకునే బియ్యాన్ని ఈ నెల ఏడో తేదీ నుంచి కేంద్రం నిలుపుదల చేసిన విషయం విదితమే. రోజుకు ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల పంపిణీ చేస్తున్నామని, ఈ నెల 20వ తేదీ నుంచి ఇస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 90.46 లక్షల రేషన్‌కార్డుదారులందరికీ బియ్యం అందేలా పంపిణీ గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. ప్రస్తుతం జూన్‌ నెల కోటా పంపిణీ చేస్తున్నామని, గడిచిన రెండు నెలలకు సంబంధించిన బియ్యాన్ని కేంద్రం విధించిన గడువు తరవాత నుంచి రెండు నెలలపాటు ఇస్తామని వివరించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని