Updated : 25 Jun 2022 05:56 IST

పట్టణాలకు పచ్చందాలు

14 లక్షల పెద్ద మొక్కలు సిద్ధం.. ఒక్కోటి ఐదడుగుల ఎత్తు
గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా నాటే కార్యక్రమం
9,360 కి.మీ. మేర రహదారుల వెంట, 19,472 క్రీడాప్రాంగణాల చుట్టూ

ఈనాడు, హైదరాబాద్‌: హరితహారంలో సాధారణంగా రెండడుగుల ఎత్తున్న మొక్కల్ని నాటుతారు. ఈసారి ఎనిమిదో విడతలో పట్టణ ప్రాంతాల్లో పెద్దమొక్కలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఏకంగా ఐదడుగుల మొక్కలను నాటనున్నారు. ఇలాంటివి పద్నాలుగు లక్షలు సిద్ధం చేశారు. అటవీశాఖ సెంట్రల్‌నర్సరీల్లో వీటిని రెండేళ్లుగా పెంచుతూవచ్చారు. మొక్కలను త్వరలో పురపాలక శాఖకు అందించనున్నట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి.

ఎందుకంత ఎత్తు?

మొక్కలను నర్సరీల్లో పెంచి ఆపై బహిరంగ ప్రదేశాల్లో నాటడం ఒక ఎత్తయితే..వాటిని బతికించడం మరో ఎత్తు. రెండడుగుల మొక్కలకు తరచూ నీళ్లు పోయాలి. పశువులు తినకుండా కాపాడాలి. ఆటంకాలను దాటి అవి పెరిగి పెద్దవై, పచ్చదనం పంచడానికి చాలా సమయం పడుతుంది. వీటన్నింటి దృష్ట్యా సుమారు ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు నర్సరీల్లోనే పెంచి, తర్వాత నేరుగా నాటే ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఇలాంటి మొక్కలు వేగంగా పెరగడంతో పాటు బతికేందుకు అవకాశాలు అధికం. నాటినచోట పచ్చదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది’ అని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

క్రీడా మైదానాలకు బయోఫెన్సింగ్‌

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ఈసారి 8.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సాగునీటి ప్రాజెక్టుల ఖాళీభూముల్లో, కాలువల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 10వేల ఎకరాల విస్తీర్ణం, 4,000 కి.మీ. పొడవునా కాలువల వెంట మొక్కల్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నాటించనుంది. లక్ష్యం ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకాశం లేనందున, వచ్చే ఏడాదీ కొనసాగించనున్నారు.

9,360 కి.మీ. జాతీయ, రాష్ట్ర, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారుల వెంట బహుళ వరుసల మొక్కలతో రహదారి వనాల అభివృద్ధి.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని 19,472 క్రీడాప్రాంగణాల చుట్టూ మొక్కలు నాటి బయోఫెన్సింగ్‌ ఏర్పాటు...ఎప్పటిలాగే గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలు, పాఠశాలల్లో మొక్కలు నాటడం.

2725కి గాను 685 బృహత్‌ ప్రకృతివనాలు పూర్తి. మిగిలినవి పూర్తిచేసి వాటిలో మొక్కలు నాటడం.

హరితహారం మొదలైనట్టా? కానట్టా?

ఎనిమిదో విడత హరితహారం ప్రారంభోత్సవంపై సందేహాలు రేగుతున్నాయి. ఈసారి తేదీని అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం వెల్లడించలేదు. తొలకరి ఆలస్యం అవుతున్నందున.. ఇంకా రెండు, మూడు గట్టివర్షాలు పడ్డాక ఎనిమిదో విడత ప్రారంభం అవుతుందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో జనగామ జిల్లాకు వెళ్లిన సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసభర్వాల్‌, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంకవర్గీస్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ‘ఎనిమిదో విడత హరితహారం’ అంటూ ట్వీట్లు చేయడం గమనార్హం.

ఈ ఏడాది 19.54 కోట్లు

2015లో ప్రారంభమైన హరితహారం ఇప్పటికే ఏడు విడతలు పూర్తయింది. 2022 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 36.28 కోట్ల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జరిగే ఎనిమిదో విడత కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శాఖలు, జిల్లాలవారీగా లక్ష్యాలు ఇప్పటికే ఖరారయ్యాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని