ఇలాగైతే సం‘పత్తి’ బాగు

రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టాయి. విత్తడం నుంచి దూది తీసేవరకూ యంత్రాలతో సాగు

Published : 25 Jun 2022 05:32 IST

విత్తడం మొదలు చివరికి దూది తీసేదాకా యంత్రమే
ముందుకొచ్చే రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం
ప్రయోగాత్మక విధానానికి వ్యవసాయ శాఖ, జయశంకర్‌ వర్సిటీ శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టాయి. విత్తడం నుంచి దూది తీసేవరకూ యంత్రాలతో సాగు చేసేందుకు ఎంపిక చేసిన రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సాధారణ పద్ధతిలో ఈ పంట సాగుకు ప్రస్తుతం ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్లను రైతులు వినియోగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ బరువు 450 గ్రాములు. ధర రూ.810. ఎకరానికి రూ.1,620 చెల్లించి విత్తనాలను కొంటున్నారు. కానీ 25 వేల విత్తనాలతో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలంటే కనీసం 5 ప్యాకెట్లు అవసరం. రైతుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. అందుకే వారికి ఆర్థిక సాయం చేయాలని జయశంకర్‌ వర్సిటీ సిఫార్సు చేసింది. ఈ సీజన్‌లో 70 లక్షల ఎకరాలకు పైగా ఈ పంట సాగు చేయించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం కోటీ 42 లక్షల ఎకరాలు కాగా ఇందులో పత్తి ఒక్కటే దాదాపు సగం ఉండాలని నిర్ణయించింది. గతేడాది ఇది 46.42 లక్షల ఎకరాల్లో సాగైంది.

పరిశోధన కేంద్రాలకు పది అధునాతన యంత్రాలు ఎంపిక చేసిన రైతుల పొలాలకు అన్నదాతలను పిలిచి వారి సమక్షంలో యంత్రంతో విత్తనాలు విత్తాలని రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పరిశోధనకేంద్రాల శాస్త్రవేత్తలకు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి(వీసీ) ప్రవీణ్‌రావు ఆదేశాలు జారీచేశారు.

ఇలా అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలను కొన్ని చోట్ల జయశంకర్‌ వర్సిటీ, ప్రైవేటు కంపెనీలతో కలసి ప్రారంభించింది. ఇందుకోసం అన్ని పరిశోధన కేంద్రాలకు పది అధునాతన యంత్రాలను సరఫరా చేశారు. పలు గ్రామాల్లో ఇప్పటికే రైతుల సమక్షంలో శాస్త్రవేత్తలు యంత్రంతో పత్తి విత్తుతున్నారు.

యంత్రాలతో పత్తి సాగుకు ఆసక్తి చూపే రైతులను వ్యవసాయశాఖ మండలాలవారీగా ఎంపిక చేస్తోంది. అధిక సాంద్రతలో సాగు వల్ల దిగుబడి పెరుగుతుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమం. కనీసం నలభై వేల నుంచి యాభై వేల మంది వరకూ ముందుకొస్తారని అంచనా వేస్తున్నాం. రైతులు ఆసక్తి కనబరిస్తే వర్సిటీ యంత్రాలు, విత్తనాలను సమకూర్చడం వంటి కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది’’ అని తెలిపారు.

యంత్రంతో కేవలం 45 నిమిషాల్లో ఎకరానికి 25 వేలకు పైగా విత్తనాలను నాటవచ్చు. ఇందుకోసం రైతు యంత్రం అద్దె కింద     రూ.1,500 చెల్లిస్తే సరిపోతుంది. అదే సాధారణ పద్ధతిలో ఐదారుమంది కూలీలు రోజంతా పనిచేస్తే ఎకరా విస్తీర్ణంలో 7,500 విత్తనాలను విత్తుతున్నారు. వారికి కూలి కింద రూ.2,500 నుంచి రూ.3,500 దాకా చెల్లించాల్సి వస్తోంది. యంత్రం వినియోగిస్తే నేరుగా కూలి రేటు బాగా కలిసొస్తుంది.

ఎకరానికి ప్రస్తుతం 7,500 మొక్కలతో పత్తి పంట సాగవుతోంది. ఇప్పుడు ఆ సంఖ్యను 25 వేలకు పెంచితే పంట దిగుబడి పెరుగుతుంది.

కూలీల కొరత, కూలి రేట్లు బాగా పెరిగినందున పత్తి సాగు వ్యయం అధికమైంది. క్వింటా పత్తి పండించాలంటే రాష్ట్రంలో రైతు సగటున రూ.11,376 చొప్పున పెట్టుబడి  పెట్టాల్సి వస్తోంది. ఈ ఖర్చు తగ్గాలంటే యంత్రాల వినియోగంతో పాటు, ఉత్పాదకతను పెంచాలి.

- జయశంకర్‌ వర్సిటీ సిఫార్సు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని