Updated : 25 Jun 2022 05:47 IST

పెళ్లిపీటలపై చిన్నారి..

కొవిడ్‌ కాలంలో పెరుగుతున్న బాల్య వివాహాలు
నాలుగునెలల్లో 820 పెళ్లిళ్లకు అడ్డుకట్ట
కరోనా నుంచి ఇప్పటి వరకు 3,219 వివాహాలను అడ్డుకున్న శిశు సంక్షేమశాఖ    

ఈనాడు, హైదరాబాద్‌:  కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు తలకిందులై రాష్ట్రంలో ఇటీవల బాల్యవివాహాలు పెరుగుతున్నాయి. ఓ వైపు అధికారులు అడ్డుకుంటున్నా, మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి. అప్పుల బాధలు, పేదరికంతో సతమతమవుతున్న తల్లిదండ్రులు మంచి సంబంధం పేరిట చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసి, బాధ్యత వదిలించుకుంటున్నారు. కఠిన చట్టాలు, బాలికల సంక్షేమ పథకాలు అడ్డుకోలేకపోతున్నాయి. యువతులకు కనీస వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావిస్తుంటే.. పట్టుమని పదహారేళ్లు నిండకుండానే చిన్నారుల్ని తల్లిదండ్రులు పెళ్లిపీటలపైకి ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 3,219 బాల్యవివాహాలను శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో 820 వివాహాలను ఆపగలిగారు. అత్యధికంగా వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, గద్వాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ బాల్యవివాహాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కాగితాలపైనే బాలల పరిరక్షణ కమిటీలు

రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధక చట్టం -2006 పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. బాలల హక్కుల్ని కాపాడటం కోసం గ్రామాల్లో బాలల సంఘాల ఏర్పాటు కాగితాల్లోనే ఉంది. 6-10 ఏళ్లు, 11-18 ఏళ్ల వారికి వేర్వేరు సంఘాలు ఉండటంతో పాటు అందులో కనీసం 15-20 మంది బాలబాలికలు సభ్యులుగా ఉండాలి. ఈ మేరకు సంఘం నెలకోసారి సమావేశం కావాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ కమిటీల ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు గ్రామ పరిపాలన విభాగాలు చొరవ చూపడం లేదు. గ్రామ సర్పంచి ఛైర్మన్‌గా, అంగన్వాడీ టీచర్‌ కన్వీనర్‌గా వివిధ విభాగాల అధికారులతో కూడిన గ్రామ బాలల పరిరక్షణ కమిటీలకు బాల్యవివాహాలను ఆపే అధికారాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఫలితం లేదు. మహిళాశిశు సంక్షేమశాఖకు బాల్య వివాహాలపై అంగన్వాడీ సిబ్బంది ద్వారా లేదా చైల్డ్‌లైన్‌ 1098, మహిళా సహాయ కేంద్రం 181, పోలీసు హెల్ప్‌లైన్‌ నంబరు 100 ద్వారా ఎక్కువగా సమాచారం వస్తోంది. దీంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వివాహాలను అడ్డుకుంటున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని