Updated : 26 Jun 2022 04:16 IST

ఉపాధ్యాయులూ ఆస్తుల వివరాలివ్వండి.. ఉత్తర్వులు.. ఉపసంహరణ

కొనాలన్నా... అమ్మాలన్నా అనుమతి తప్పనిసరన్న విద్యాశాఖ

టీచర్లలో కలవరంతో స్పందించిన ప్రభుత్వం

వెంటనే నిలిపివేయాలని మంత్రి సబితారెడ్డి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, దేవరుప్పుల: ‘‘ఉపాధ్యాయులు తమ స్థిర, చర ఆస్తుల వివరాలను; క్రయవిక్రయాల సమస్త సమాచారాన్ని ఏటా ప్రకటించాలి. స్థిర, చరాస్తులను కొనాలన్నా...అమ్మాలన్నా ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి’’ అని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. తక్షణమే ఆపేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని ఆమె విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఆస్తుల వెల్లడిపై జారీ అయిన ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో కలవరం రేగింది. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష కట్టిందని రాజకీయ పార్టీలు విమర్శించాయి. స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇవీ ఉత్తర్వులు...

‘‘విద్యాశాఖలోని ప్రతి ఉద్యోగి తన ఆస్తులను వార్షిక ఆస్తుల స్టేట్‌మెంట్‌ రూపంలో ఏటా ఉన్నతాధికారులకు సమర్పించాలి. తన పేరిట ఉన్న చర, స్థిర ఆస్తులను విక్రయించాలన్నా, కొనాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలి’’ అని పేర్కొంటూ ఈనెల 8న ఆర్సీ నంబరు 192/ఎస్టాబ్లిష్‌మెంట్-1/2022తో పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు, ఫ్లాట్‌లు, దుకాణాలు, ప్లాట్లు, సాగు భూములు.. ఇలా 9 రకాలను అందులో ప్రస్తావించింది. ఆస్తిని కొంటే సర్వే నంబరు, స్వాధీనంలోకి వచ్చిన తేదీ, చెల్లించిన ధర.. తదితర వివరాలను సమగ్రంగా సమర్పించాలని పేర్కొంది. అమ్మినా సరే పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఈ ఆదేశాలు ఉపాధ్యాయుల్లో కలవరం రేపాయి. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు కేవలం ఉపాధ్యాయులకే పరిమితం కాదని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వర్తిస్తాయని తెలిపారు. విజిలెన్స్‌ నివేదిక నేపథ్యంలో తాజాగా మరోసారి ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యాశాఖలో సుమారు 1.10లక్షల మంది ఉపాధ్యాయులు... నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఇతర ఉద్యోగులు దాదాపు 20 వేల మంది ఉంటారు.

జావేద్‌ అలీపై విజిలెన్స్‌ నివేదికతో...

మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఉత్తర్వులే విద్యాశాఖ ఇచ్చింది. ఉపాధ్యాయుల ఆందోళనతో వివరాల వెల్లడి అవసరం లేదని ఆనాడు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆ తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోలేదు. తాజా ఉత్తర్వులకు జావేద్‌ అలీ ఉదంతమే కారణం. ఫిర్యాదుల నేపథ్యంలో నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్‌ జావేద్‌ అలీపై సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పరిధిలో పనిచేసే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు విచారణ జరిపి నివేదికను సమర్పించారు. ‘‘జావేద్‌ అలీ విధులకు సరిగా హాజరు కావడం లేదు. రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్థిరాస్తి వ్యాపారం, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమే’’ అని విజిలెన్స్‌ అధికారులు 2021 ఏప్రిల్‌లో నివేదికను సమర్పించారు. ‘‘ఆస్తులు కొనే ముందు విద్యాశాఖ అనుమతి తీసుకోలేదు. వార్షిక ఆస్తుల వివరాలను సమర్పించలేదు. ఆయనపై శాఖాపరమైన చర్యలతోపాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ తాజా ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఉపాధ్యాయులకు బయో మెట్రిక్‌ హాజరు అమలు చేయాలని కూడా విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని