ఆర్టీసీ నష్టం రూ.1,987 కోట్లు!

ఆర్టీసీ నష్టాల బాట వీడటం లేదు. మునుపటితో పోలిస్తే మాత్రం కొంత తగ్గాయి. సర్వీసుల హేతుబద్ధీకరణ, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కసరత్తుతో ఆదాయం ఒకింత పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి

Updated : 26 Jun 2022 07:18 IST

గత ఏడాదితో పోల్చితే రూ.342 కోట్ల తగ్గుదల

ఈనాడు, హైదరాబాద్‌ : ఆర్టీసీ నష్టాల బాట వీడటం లేదు. మునుపటితో పోలిస్తే మాత్రం కొంత తగ్గాయి. సర్వీసుల హేతుబద్ధీకరణ, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కసరత్తుతో ఆదాయం ఒకింత పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే రూ. 1,986.86 కోట్ల నష్టం నమోదైంది. 2020-21తో పోలిస్తే రూ.342.37 కోట్ల మేర తగ్గింది. గత డిసెంబరులో ఆర్టీసీ పగ్గాలు చేపట్టిన పోలీస్‌ బాస్‌ వీసీ సజ్జనార్‌ దిద్దుబాటు చర్యలపై దృష్టిసారించారు. రోజువారీ ఆదాయ, వ్యయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇతర మార్గాల ద్వారా రూ.245 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.100 కోట్లు అదనం. కార్గో సేవలను ప్రైవేటు వారి ద్వారా కాకుండా సొంతంగా నిర్వహించడం కూడా ఒక కారణంగా ఉంది. ఆర్టీసీ సొంత బస్సులను తగ్గించుకుంటూ వస్తోంది. 2020-21లో 9,459 బస్సులు నడిపింది. అందులో సొంతవి 6,544.. అద్దెవి 2,915. అంతకుముందు సంవత్సరం కన్నా 226 సొంత బస్సులు తగ్గాయి.

మరింత తగ్గనున్న నష్టాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టం గణనీయంగా తగ్గుతుందని అంచనా. డీజిల్‌పై 2021-22లో చేసిన ఖర్చు రూ.1,228 కోట్లు కాగా గత ఏడాది చేసిన వ్యయం రూ.736 కోట్లు మాత్రమే. దీంతో డీజిల్‌ సెస్సు పేరుతో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపింది. దూరప్రాంతాలకు వెళ్లే వారు గరిష్ఠంగా రూ.170 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. టోల్‌ట్యాక్స్‌ నుంచి వివిధ రకాల సర్‌ఛార్జీలను సైతం పెంచారు. ప్రస్తుతం సగటున రోజువారీ ఆదాయం రూ.14 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.129.95 కోట్ల నష్టం నమోదు కాగా మేలో ఆ మొత్తంలో రూ.22.76 కోట్లు తగ్గింది.


పెరుగుతున్న ప్రయాణికులు

కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజా రవాణాను వినియోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్‌ సమయంలో రోజువారీగా ఆదాయం రూ. 3-4 కోట్లకు పరిమితం కాగా ప్రస్తుతం రూ.12- 14 కోట్లకు పెరిగింది. ఆక్యుపెన్సీ 70 శాతానికి చేరుకుంది. 2021-22లో 98.28 కోట్ల కిలోమీటర్ల మేరకు బస్సులు నడపగా.. అంతకుముందు సంవత్సరం 73.87 కోట్ల కిలోమీటర్లు మాత్రమే నడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని