Telangana News: ఆ విద్యార్థుల సర్దుబాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

ప్రమాణాల ప్రకారం వసతుల్లేని వైద్య కళాశాలల అనుమతులను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) స్పష్టంచేసింది. విద్యార్థుల మెరిట్‌,

Updated : 26 Jun 2022 08:13 IST

హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రమాణాల ప్రకారం వసతుల్లేని వైద్య కళాశాలల అనుమతులను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) స్పష్టంచేసింది. విద్యార్థుల మెరిట్‌, ఇతర కాలేజీల్లో ఖాళీల ఆధారంగా సీట్లను సర్దుబాటు చేయాలంది. ఒకవేళ సీట్లు ఖాళీగా లేనిపక్షంలో ఈ ఒక్కసారికి వాటిని పెంచాల్సి ఉంటుందని.. ఇందుకు కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందని తెలిపింది. తమ ప్రవేశాలను రద్దు చేసి.. సర్దుబాటుకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాల పీజీ విద్యార్థులు డాక్టర్‌ ఎం.వర్షిణి, మరో 47 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఎంసీ తరఫున కార్యదర్శి ప్రభాత్‌కుమార్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆవశ్యకత ధ్రువీకరణ పత్రం ఆధారంగా మెడికల్‌ అడ్మిషన్లకు అనుమతి మంజూరవుతుందని.. ఎన్‌ఎంసీల నిబంధనల ప్రకారం కనీస ప్రమాణాలు పాటించని పక్షంలో ప్రవేశాలను నిలిపివేస్తామన్నారు. అందువల్ల అనుమతులు రద్దయిన కళాశాలల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఇందుకు ఇతర కాలేజీల్లో మౌలిక వసతులు, వనరులను పరిశీలించి సీట్ల సంఖ్యను పెంచాలని, అయితే అండర్‌ గ్రాడ్యుయేట్‌లో 250కి మించకూడదన్నారు. పీజీ సీట్లను కూడా సర్దుబాటు చేయాలన్నారు. సీట్ల రద్దు సమయంలోనే రాష్ట్రానికి మార్గదర్శకాలను పంపామని, విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలో కూడా పేర్కొన్నామని స్పష్టంచేశారు.

సీట్లను పెంచాకే ప్రవేశాలు: రాష్ట్ర ప్రభుత్వం

అనుమతులు రద్దయిన కళాశాలల విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడానికి ముందుగా ఎన్‌ఎంసీ సూపర్‌ న్యూమరరీ సీట్లను సృష్టించాల్సి ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అనుమతుల రద్దుపై కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లపై ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకునేదాకా.. వాటిపై చర్యలు తీసుకోవద్దంటూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. ఎంఎన్‌ఆర్‌, మహావీర్‌ కళాశాలల్లోని 450 యూజీ, 100 పీజీ సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ఎంత శాతం సీట్లు పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు పంపాల్సి ఉందని తెలిపింది. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 1 ఈఎస్‌ఐసీ, 19 నాన్‌-మైనారిటీ, 4 ప్రైవేట్‌ మైనారిటీ కళాశాలలున్నాయంది. ఇందులో ఉస్మానియా, గాంధీ, కాకతీయ కాలేజీల్లో గరిష్ఠంగా 250 సీట్లు ఉన్నాయని, వీటిలో సీట్ల పెంపునకు నిబంధనలు అనుమతించవంది. మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా నిమిత్తం మంజూరైన సీట్ల కంటే ఎక్కువ అడ్మిషన్లు చేపట్టినట్లు తెలిపింది. వీటిలో అదనపు ప్రవేశాలకు వసతులు లేవంది. నల్గొండ, సూర్యాపేటల్లో రెండేళ్ల క్రితమే కళాశాలలు ప్రారంభమయ్యాయని, ఇక్కడ కొత్త అడ్మిషన్లకు వసతి గృహాలు లేవంది. ఎన్‌ఎంసీ సీట్లను సృష్టించాక వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. అదనపు అడ్మిషన్లు చేపట్టడానికి ప్రైవేటు కాలేజీలకూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు జులై 7న విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు