సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లోని ప్రతిభ కలిగిన వంద మంది విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఆవరణలో హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహిస్తామని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Updated : 26 Jun 2022 06:03 IST

బీసీ గురుకుల విద్యార్థులకు హార్వర్డ్‌ ప్రొఫెసర్లతో క్లాసులు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లోని ప్రతిభ కలిగిన వంద మంది విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఆవరణలో హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహిస్తామని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హార్వర్డ్‌లో చేరేందుకు పదిరోజులు నిర్వహించే ఈ తరగతులు ఉపయోగపడతాయన్నారు. విదేశీ విద్యకు ఉపకార వేతనాలు పొందేందుకు వీలవుతుందని  పేర్కొన్నారు. శనివారమిక్కడ హార్వర్డ్‌ వర్సిటీ సహాయ డైరెక్టర్‌ డొమినిక్‌ మావో, ఓయూ ప్రొ.మల్లేశంలు బుర్రా వెంకటేశంను కలిసి తరగతుల నిర్వహణకు ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.  


బ్యాంకు ఉద్యోగాలకు బీసీ స్టడీసర్కిల్‌ ఆన్‌లైన్‌ శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌ : ఐబీపీఎస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) ఉద్యోగాలకు బీసీ స్టడీసర్కిల్‌లో వెయ్యిమంది అభ్యర్థులకు 45 రోజుల పాటు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ తెలిపారు. జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేస్తామని, జులై 1 నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తికల అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


మూడో రోజూ జేఈఈ మెయిన్‌ ఆలస్యం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ మొదలైన మూడో రోజు కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌ అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలు ఉండగా... అందులోని ఓ కేంద్రంలో ఉదయం విడత పరీక్ష ఉదయం 9 గంటలకు బదులు 10.30 గంటలకు ప్రారంభమైంది. మరో కేంద్రంలో మధ్యాహ్నం విడత పరీక్ష 3 గంటలకు ప్రారంభమవ్వాల్సి ఉండగా.. 3.30 గంటలకు మొదలైంది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


ఇతర పన్ను బకాయిలకూ ఓటీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వాణిజ్య పన్నుల బకాయిల వసూళ్ల కోసం చేపట్టిన ఒకే విడత పరిష్కారం (వన్‌ టైం సెటిల్‌మెంట్‌-ఓటీఎస్‌) పథకాన్ని మరిన్ని పన్నులకు విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు   జారీ చేసింది. ఇప్పటి వరకు జీఎస్టీ బకాయిలకే దీన్ని వర్తింపజేస్తున్నారు. ఇకపై విలాస, వినోద పన్నులు, వృత్తి, రహదారి, మోటారు వాహనాల పన్నులకు విస్తరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం బకాయి ఉన్నవారు అసలు మొత్తంలో 50 శాతం చెల్లిస్తే చాలు. అపరాధ రుసుం/జరిమానాలు, వడ్డీల బకాయిల్లో 15 శాతం చెల్లిస్తే సరిపోతుంది. న్యాయస్థానాల్లో కేసులు ఉంటే ఓటీఎస్‌ వర్తించదు. వివాదరహితమైన వాటికే దీనిని అమలు చేస్తారు.


ఏకరూప దుస్తుల కుట్టు పనుల నిబంధనల్లో మార్పు

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టు పనులకు సంబంధించిన నిబంధనల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ప్రధాన నగరాల్లోని దర్జీలు మండల వనరుల కేంద్రం నుంచి వస్త్రాన్ని గంపగుత్తగా తీసుకెళ్లి, దుస్తులు కుట్టి అందించేవారు. ప్రస్తుతం స్థానిక మేరు వృత్తిదారులు, కుట్టు పనులు చేసే పొదుపు సంఘాల మహిళలతో దుస్తులు కుట్టించి అందించాలని అధికారులు నిర్ణయించారు. ఏకరూప దుస్తులు కుట్టే అవకాశాన్ని తమకూ ఇచ్చి జీవనోపాధి కల్పించాలని ఇటీవల మేరు సంఘం ప్రతినిధులు రాష్ట్ర అధికారులకు వినతి చేశారు. ఈ మేరకు అధికారులు తాజాగా నిబంధనలను మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. 70 శాతం పొదుపు సంఘాల మహిళలకు, 30 శాతం స్థానిక మేరు వృత్తిదారులకు వస్త్రాన్ని అందించి దుస్తులు కుట్టించాలని విద్యాధికారులకు ఆదేశాల్లో స్పష్టం చేశారు.


రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్‌ చేసుకునేందుకు సోమవారం ఉదయం 10 నుంచి జూన్‌ 29 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


క్లాట్‌ ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక జాతీయ న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19వ తేదీన నిర్వహించిన కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌-2022) ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మొత్తం 56,472 మంది పరీక్ష రాశారు. ఈ నెల 25వ తేదీన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.


జులై 8 నుంచి యూజీసీ నెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: యూజీసీ నెట్‌ పరీక్షలు జులై 8వ తేదీన మొదలుకానున్నాయి. 2021 డిసెంబరు, 2022 జూన్‌ పరీక్షలను కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల తేదీలను యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ శనివారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. పరీక్షల కాలపట్టికను త్వరలో ఎన్‌టీఏ వెబ్‌సైట్లో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. జులై 8, 9, 11, 12, ఆగస్టు 12, 13, 14 తేదీల్లో యూజీసీ నెట్‌ నిర్వహించనున్నారు.


కొర్రెముల ఉప పశువైద్యాధికారి సస్పెన్షన్‌

ఈనాడు, హైదరాబాద్‌: విధి నిర్వహణలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగానూ మేడ్చల్‌ జిల్లా కొర్రెముల పశువైద్య కేంద్రంలో పనిచేస్తున్న ఉప పశువైద్య అధికారి ఎస్‌.శ్రీనివాసరావును అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆయన పలు అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పశుసంవర్ధకశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని