28న కేసీఆర్‌ చేతులమీదుగా ‘టి-హబ్‌ 2’ ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం రూ.276 కోట్లతో నిర్మించిన ‘టి-హబ్‌ 2’ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో వెల్లడించారు. రాయదుర్గంలో 3.70 లక్షల చదరపు

Published : 27 Jun 2022 06:16 IST

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రూ.276 కోట్లతో నిర్మించిన ‘టి-హబ్‌ 2’ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో వెల్లడించారు. రాయదుర్గంలో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హబ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యూబెటర్‌ కానుందని అందులో వివరించారు. ‘‘టి-హబ్‌ 2 ద్వారా కొత్త ఆలోచనలు, మరికొన్ని అంకురాల ఆవిర్భావానికి మంచి వాతావరణాన్ని కల్పించినట్లు అవుతుంది. ఇప్పటికే ఫేజ్‌-1 ద్వారా 1,100 అంకురాల కంపెనీలు రూ.1,860 కోట్ల నిధులు సేకరించాయి. ఈ భవన సముదాయంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కేటీఆర్‌కు ప్రశంసలు: టి-హబ్‌ 2ను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను పలువురు ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. కేటీఆర్‌ను చూసి గర్వపడుతున్నామని సినీ నటుడు మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఈ భవనం ఎంతో ఆకట్టుకుంటోందని సానియా మీర్జా, అద్భుతంగా ఉందని సైనా నెహ్వాల్‌ అన్నారు. ఆ భవనాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సినీ నటి సమంత, టి హబ్‌ భవనం హైదరాబాద్‌కు గర్వకారణం అని నటుడు సందీప్‌ కిషన్‌ పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ సర్‌ చొరవకు వందనాలు.. భవనాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది’ అని పీవీ సింధు ట్వీట్‌ చేశారు. ‘‘నిన్న ఆ భవనం ముందు నుంచి వెళ్తున్నప్పుడు దాన్ని చూసి మురిసిపోయాను. ఆ సుందర భవనాన్ని చూడాలని కారు తిప్పాను. దగ్గరికి వెళ్లి చూడగానే అది టి హబ్‌ అని అర్థమైపోయింది. కేటీఆర్‌కు వందనాలు’’ గగన్‌ నారంగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని