Published : 27 Jun 2022 05:24 IST

ఆంధ్రప్రదేశ్‌లో లీజుకు క్వార్టర్లు

 గ్రూప్‌-డి ఉద్యోగుల టవర్‌ను విట్‌ యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయం

ఏటా రూ.10 కోట్ల ఆదాయం అంచనా

హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనంటున్న అమరావతి ప్రజలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వీల్లేదని మార్చి 3న హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం రాజధానిలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించింది. నిధుల సమీకరణకు రాజధానిలో భూములు విక్రయించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రాజధానిలో నాలుగో తరగతి (గ్రూప్‌-డి) ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో ఒకటి విట్‌ యూనివర్సిటీకి లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. ఒక టవర్‌తో మొదలుపెట్టి దశలవారీగా అన్ని టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు రాజధానిని ఇక్కడే కొనసాగించాలన్న ఆలోచనే ఉంటే, ఉద్యోగుల కోసం నిర్మించిన టవర్లను ప్రైవేటు సంస్థలకు ఎందుకు లీజుకిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధానిలో పనులు జరుగుతున్నట్లుగా భ్రమ కలిగించేందుకు అరకొర పనులు చేస్తూ, కోర్టులో అఫిడవిట్లు వేస్తూ నెట్టుకొస్తున్న ప్రభుత్వ అసలు ఉద్దేశం ఈ చర్యతో బట్టబయలైందని అమరావతి రైతులు, ప్రజలు మండిపడుతున్నారు.

ఆగి ఆగి.. సాగుతున్న నిర్మాణాలు

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారులు మొదలు నాలుగో తరగతి (గ్రూప్‌-డి) ఉద్యోగుల వరకు.. వారు నివసించేందుకు గత ప్రభుత్వ హయాంలో సీఆర్‌డీఏ పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్‌ టవర్ల నిర్మాణం ప్రారంభించింది. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉండగానే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పనులు ఎక్కడికక్కడే నిలిపివేసింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌  అధికారుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో పెండింగ్‌ పనుల్ని ప్రారంభించింది.గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం తలపెట్టిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో పెండింగ్‌ పనుల్ని ఇంకా ప్రారంభించలేదు. వాటిలో గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం నిర్మించిన ఆరు టవర్లలో డి-1 టవర్‌ను విట్‌ యూనివర్సిటీకి లీజుకిచ్చేందుకు సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇటీవల సీఎం జగన్‌ కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. నెల రోజుల క్రితం విట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చి ఆ టవర్లను పరిశీలించి వెళ్లినట్టు సమాచారం.

సంవత్సరానికి రూ.10 కోట్ల లీజు? 

గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం 7.76 ఎకరాల విస్తీర్ణంలో 6 టవర్లను సీఆర్‌డీఏ నిర్మించింది. వాటిలో 720 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 900 చ.అడుగులు.  మొత్తం టవర్‌లో నిర్మిత ప్రాంతం 1,70,400 చ.అడుగులని ఇటీవల సీఎంకు ఇచ్చిన నివేదికలో సీఆర్‌డీఏ పేర్కొంది. ఆ టవర్‌ మొత్తాన్ని లీజుకు ఇచ్చేందుకు విట్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వస్తే సంవత్సరానికి లీజు రూపంలో రూ.8-10 కోట్లు వస్తుందని తెలిపింది. రాజధానిలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల భవనాల తర్వాత, ఎక్కువ శాతం పని పూర్తయినవి గ్రూప్‌-డి ఉద్యోగుల టవర్లే. కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే అవి సిద్ధమైపోతాయని, అందుకే వాటిని లీజుకివ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించిందని సమాచారం. భవిష్యత్తులో మిగతా టవర్లను లీజుకు తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే ఇచ్చేసే యోచనలో సీఆర్‌డీఏ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ అవసరాలు, ఉద్యోగుల నివాసాల కోసం నిర్మించిన భవనాల్ని లీజుకిచ్చేస్తే అది రాజధాని ఎలా అవుతుందని రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య హైకోర్టు తీర్పునకు విరుద్ధమని మండిపడుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts