పంటల మార్పిడితో అధిక ఆదాయం: మంత్రి నిరంజన్‌రెడ్డి

పంటల మార్పిడితో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, పంటల వైవిధ్యంతో సాగు పెట్టుబడులు తగ్గించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం(28) నుంచి రైతుల ఖాతాల్లో తొమ్మిదో విడత

Published : 27 Jun 2022 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: పంటల మార్పిడితో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, పంటల వైవిధ్యంతో సాగు పెట్టుబడులు తగ్గించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం(28) నుంచి రైతుల ఖాతాల్లో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమచేస్తామని ప్రకటించారు. తొలిరోజు మంగళవారం ఎకరా రైతుల ఖాతాల్లో, బుధవారం రెండెకరాలు, గురువారం మూడె కరాలున్నవారి ఖాతాల్లో... ఇలా రోజూ ఎకరం చొప్పున పెంచుతూ రైతుబంధు నిధులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన 17 వ్యవసాయ సదస్సులు విజయవంతమయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.50,447.33 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. రైతుబీమా పథకం కింద రైతు కుటుంబాలకు రూ.4,150.90 కోట్లను పరిహారంగా అందజేశామన్నారు.

పచ్చిరొట్ట పైర్లను కలియదున్నాలి

రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించేందుకు పచ్చిరొట్ట పైర్లు వేసి నేలలో కలియదున్నాలని మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు వివరించారు. తెలంగాణ నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నందున డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం తగ్గించాలన్నారు. ఇప్పటికే నేలల్లో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందేలా చూసేందుకు ‘ఫాస్ఫరస్‌ సాల్యుబుల్‌ బ్యాక్టీరియా’(పీఎస్‌బీ) వంటి జీవన ఎరువుల వినియోగం పెంచాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు రైతులకు సేవలు అందించేందుకు రైతువేదికలను ఉపయోగించుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని