పనితీరులో వెనక‘బడి’న రాష్ట్రం

బడుల్లో వివిధ సౌకర్యాలు, విద్యానాణ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌ గ్రేడ్‌ ఇండెక్స్‌ (పీజీఐ)లో రాష్ట్రం బాగా వెనకబడింది. మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే

Updated : 28 Jun 2022 05:14 IST

772 పాయింట్లతో దేశంలో 23వ స్థానం
పీజీఐ నివేదికను విడుదల చేసిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: బడుల్లో వివిధ సౌకర్యాలు, విద్యానాణ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌ గ్రేడ్‌ ఇండెక్స్‌ (పీజీఐ)లో రాష్ట్రం బాగా వెనకబడింది. మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే 1000 పాయింట్లకు 772 సాధించి తెలంగాణ 23వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం దిగువన ఉన్నది కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే. 2018-19 పీజీఐ స్కోర్‌ను తెలంగాణ కొంత మెరుగుపరచుకోవడం కాస్త ఊరట. గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా మొత్తం 10 స్థాయులుగా రాష్ట్రాల పనితీరును విభజించారు. అందులో మొదటి లెవెల్‌(951-1000 స్కోర్‌)లో ఏ ఒక్క రాష్ట్రమూ నిలవలేదు. తెలంగాణ అయిదో స్థాయి(751-800)లో నిలిచింది. పరిపాలన విధానంలో బిహార్‌ కన్నా కూడా తెలంగాణ తక్కువ స్కోర్‌ సాధించడం గమనార్హం.
 

ఈ జిల్లాల్లో కాస్త మెరుగు..

జిల్లాలవారీగా చూస్తే రాష్ట్రస్థాయిలో ఖమ్మం అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత  హనుమకొండ, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, హైదరాబాద్‌, మంచిర్యాల తర్వాతి స్థానాలను అందుకున్నాయి. నారాయణ్‌పేట జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

విద్యారంగంలో దక్షత సాధించని జిల్లాలు

దేశంలో పాఠశాల విద్యలో జిల్లాల సామర్థ్యాన్ని బేరీజు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సోమవారం 2018-19, 2019-20 పనితీరు ఆధారిత సూచిక (పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ ఫర్‌ డిస్ట్రిక్స్‌-పీజీఐడీ)ను విడుదల చేసింది. అవుట్‌కమ్స్‌, తరగతిగదుల్లో పరిస్థితి, మౌలికవసతులు, సౌకర్యాలు, విద్యార్థుల హక్కులు, బడుల్లో భద్రత, చిన్నారుల సంరక్షణ, డిజిటల్‌ అభ్యాసం, పరిపాలన ప్రక్రియల్లో మొత్తం 83 కొలమానాలను ప్రమాణంగా చేసుకొని 600 మార్కుల ఆధారంగా జిల్లాల పనితీరును లెక్కించారు. 90%కి పైగా మార్కులు సాధించిన జిల్లాలను దక్ష్గా, 81-90% సాధించిన జిల్లాలను ఉత్కర్ష్‌గా, 71-80% మార్కులు సాధించిన వాటిని అతి ఉత్తమ్‌గా, 61-70% మార్కులు సాధించిన వాటిని ఉత్తమ్‌, తదితరాలుగా గుర్తించారు. ఇందులో దేశంలో ఏ జిల్లా కూడా 2019-20లో దక్ష్ గౌరవాన్ని దక్కించుకోలేదు. ఉత్కర్ష్‌ గౌరవాన్ని రాజస్థాన్‌లోని సికర్‌, ఝున్‌ఝును, జైపుర్‌ జిల్లాలు అందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా తొలి, చిత్తూరు చివరి స్థానంలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు