‘ప్రగతి భవన్‌కు పాదయాత్ర’ అడ్డగింత

తమ భూములు తమకు అప్పగించాలంటూ గిరిజనులు చేపట్టిన ‘ప్రగతి భవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులకు చెందిన

Updated : 28 Jun 2022 06:25 IST

గిరిజనులపై పోలీసుల లాఠీఛార్జి.. ఉద్రిక్తత

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తమ భూములు తమకు అప్పగించాలంటూ గిరిజనులు చేపట్టిన ‘ప్రగతి భవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులకు చెందిన 573 ఎకరాల భూమి దశాబ్దాలుగా అటవీశాఖ ఆధీనంలో ఉంది. ఆ భూమిపై గిరిజనులకే హక్కు ఉందంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా అధికారులు సదరు భూములను తమకు అప్పగించలేదంటూ బాధితులు ఎప్పట్నుంచో పోరాడుతున్నారు. సమస్యను సీఎం దృష్టికి తేవాలని లక్ష్యంతో ‘ప్రగతి భవన్‌కు మహా పాదయాత్ర’ పేరిట పోరాటానికి సిద్ధపడ్డారు. పాదయాత్ర సోమవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు రామన్నగూడెం వెళ్లి సర్పంచి మడకం స్వరూప, మరికొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అయినా పట్టువదలని గిరిజనులు ఉదయం పాదయాత్ర ప్రారంభించగా, అశ్వారావుపేట మండలం గంగారం సమీపంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు అడ్డగించాయి. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం..ఘర్షణకు దారితీసింది. ఒక దశలో బలగాలు లాఠీలు ఝళిపించడం, మహిళలపై పురుష పోలీసులు చేయిచేసుకోవడం, వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. రోప్‌పార్టీలు వారిని నెట్టేయడంతో మహిళలు సమీపంలోని తుప్పల్లో పడిపోయారు. అనంతరం బలగాలు చంటిబిడ్డల తల్లులు, పిల్లలు సహా అందర్నీ బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించాయి. నిరసనగా ములకలపల్లిలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రామన్నగూడెం గిరిజనులు ధర్నా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని