సంక్షిప్త వార్తలు

ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తులకు జులై 26 చివరి తేదీగా నిర్ణయించినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం  తెలిపారు. వర్సిటీతో పాటు అపోలో ఇన్‌స్టిట్యూట్‌

Updated : 29 Jun 2022 06:00 IST

‘ఎంబీఏ’ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు గడువు జులై 26

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తులకు జులై 26 చివరి తేదీగా నిర్ణయించినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం  తెలిపారు. వర్సిటీతో పాటు అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఐహెచ్‌సీఎం), కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కిమ్స్‌), దారుస్సలాం ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (డీఈటీ) ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌ ‌www.braouonline.in  ద్వారా దరఖాస్తు నింపి, పరీక్ష రుసుం ఆన్‌లైన్‌లో లేదా తెలంగాణ ఆన్‌లైన్‌ ఫ్రాంఛైజీల ద్వారా చెల్లించి రసీదు పొందాలన్నారు. పూర్తి వివరాలకు 040-23680441/241/246 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని వర్సిటీ అధికారులు కోరారు.  


 బీఈడీ, ఎల్‌ఎల్‌బీకి గరిష్ఠ ఫీజు రూ.36 వేలు

ఈనాడు, హైదరాబాద్‌: బీఈడీ, ఎల్‌ఎల్‌బీకి గరిష్ఠ ఫీజు రూ.36 వేలుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ  ఖరారు చేసింది. కనిష్ఠంగా రూ.20 వేలు ఉంటుంది. ఎల్‌ఎల్‌ఎంకి గరిష్ఠంగా రూ.42 వేలు, కనిష్ఠం రూ.20 వేలు, బీపీఈడీకి గరిష్ఠం రూ.28 వేలు, కనిష్ఠం రూ.17 వేలుగా ఖరారు చేశారు.


శ్రీచైతన్య విద్యాసంస్థల జయకేతనం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ, అధినేత బి.ఎస్‌.రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌లో ముగ్గురు 993 మార్కులను, 14 మంది 992 మార్కులను, 49 మంది 990 మార్కులకుపైగా, 11,083 మంది 925కుపైగా, 13,614 మంది విద్యార్థులు 900పైగా మార్కులను సాధించారన్నారు. జూనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో 467, బైపీసీ విభాగంలో 437 లాంటి అత్యుత్తమ మార్కులతో పాటు 14,635 మంది 425 మార్కులకు పైగా, 20,278 మంది విద్యార్థులు 400 మార్కులకుపైగా సాధించారన్నారు.


ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విజయభేరి

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ విద్యార్థులు విజయభేరీ మోగించారని ఆ అకాడమీ ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో ఒకరు 992, ఇద్దరు విద్యార్థులు 990 మార్కులు, ఎంపీసీలో ఆరుగురు 991 మార్కులు, ఏడుగురు విద్యార్థులు 990కి పైగా మార్కులు, ఎంఈసీలో ఒకరు 983, సీఈసీలో ఒకరు 979 మార్కులు సాధించారని చెప్పారు.  


అల్ఫోర్స్‌ విద్యార్థుల ప్రతిభ

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపారని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో  ఇ.నవ్యశ్రీ 994 మార్కులు, బైపీసీలో ఎ.అర్చన 993, ఎంఈసీలో జి.శ్రీచక్రిత 986, ప్రథమ సంవత్సరం సీఈసీ విభాగంలో పి.శివాని 493 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందారని వివరించారు.  


నారాయణ విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్‌ 2022 ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు 468 మార్కులను ఏడుగురు సాధించగా అందులో తమ విద్యార్థులే అయిదుగురు ఉన్నారన్నారు. బైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు 437, 436 మార్కులను పది మంది విద్యార్థులు సాధించారన్నారు. సీనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో 993 మార్కులతో ఇద్దరు, బైపీసీ విభాగంలో 991 మార్కులతో ఇద్దరు స్టేట్‌ టాప్‌ సాధించారన్నారు.


రాష్ట్రంలో 459 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 459 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 247 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,172 మంది ఐసొలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 26,126 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా ఫలితాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 232, రంగారెడ్డి జిల్లాలో 60, సంగారెడ్డిలో 54 మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో 26,040 మందికి టీకాలు పంపిణీ చేశారు.


ప్యాక్స్‌ సిబ్బందికి త్వరలో కొత్త హెచ్‌ఆర్‌ విధానం: కొండ్రు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్‌)ల పాలకవర్గాలకు, సిబ్బందికి త్వరలో కొత్త మానవ వనరుల(హెచ్‌ఆర్‌) విధానం అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వనుందని రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) ఛైర్మన్‌ కొండ్రు రవీందర్‌రావు తెలిపారు. ప్యాక్స్‌ ఛైర్మన్ల వేదిక నేతలు మంగళవారం టెస్కాబ్‌కు వచ్చి ఆయనను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ ప్యాక్స్‌ ఛైర్మన్లకు గౌరవ వేతనంతో పాటు ప్రొటోకాల్‌ నిబంధనల అమలుకు, కొత్త హెచ్‌ఆర్‌ విధానం తేవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.


త్వరలో చేనేత బీమా: ఎమ్మెల్సీ రమణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని చేనేత కార్మికులకు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభిస్తారని తెరాస ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తెలిపారు. చేనేత అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని, బీమా పథకంతో వారికి మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. మంగళవారం రమణ చేనేత శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి బీమా పథకంపై చర్చించారు. త్వరలో మంత్రి కేటీ రామారావు వద్ద విధివిధానాలు ఖరారవుతాయని అధికారులు తెలిపారు.


24 బొగ్గు గనులకు 38 బిడ్లు
‘కోయగూడెం బ్లాక్‌-3’కు ఒకటి దాఖలు

ఈనాడు, దిల్లీ: దేశంలోని 24 బొగ్గు గనుల్లో వాణిజ్యపరమైన బొగ్గు వెలికితీత కోసం నిర్వహించిన వేలంలో 31 కంపెనీల నుంచి 38 బిడ్లు దాఖలైనట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో సింగరేణి కాలరీస్‌కు చెందిన కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌-3 ప్రాజెక్టుకోసం ఒక బిడ్డు దాఖలైంది. ఒడిశాలోని ఘోగ్రాపల్లి మైన్‌కు అత్యధికంగా ఏడు బిడ్లు వచ్చాయి. వీటిని వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక మదింపు కమిటీ విశ్లేషిస్తుంది. తరవాత అర్హత సాధించిన బిడ్డర్ల పేర్లను ఎంపికచేసి ఎలక్ట్రానిక్‌ వేలంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.


కృష్ణా ట్రైబ్యునల్‌ కాలపరిమితి  మరో ఏడాది పొడిగింపు

ఈనాడు, దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌ కాలపరిమితిని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. 2022 ఆగస్టు 1 నుంచి మరో ఏడాదిపాటు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఇందులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89 (ఏ) (బి) క్లాజ్‌లను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించే అంశాన్ని కేంద్రం ఈ ట్రైబ్యునల్‌కు అప్పగించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు నివేదికను సమర్పించడానికి తమకు మరో ఏడాది గడువు కావాలని ట్రైబ్యునల్‌ కోరిన మీదట జల్‌శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. అంతర్రాష్ట్ర జలవివాద చట్టం 1956లోని సెక్షన్‌ 5(3) కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి రెండు రాష్ట్రాల మధ్య జలవివాద అంశంపై నివేదిక సమర్పణకు మరో ఏడాది గడువిస్తున్నట్లు జల్‌శక్తి శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.


వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలి

ఈనాడు, దిల్లీ: బొగ్గు గని కార్మికులకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలుచేయాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) నేత కె.లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గతేడాది జులై 1 నుంచి అమలు కావాల్సిన ఒప్పందాన్ని పలు కారణాలతో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని