- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కరోనా బ్యాచ్ అయినా.. ఇంటర్లో సత్తా చాటారు
ఇంటర్లో సాధారణ స్థాయికి ఉత్తీర్ణత శాతం
ఫస్టియర్‌లో 63.32%, సెకండియర్‌లో 67.16% పాస్
అమ్మాయిలదే హవా... బాలుర కంటే 16-18% అధికం
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ప్రస్తుతం ఫస్టియర్ పాసైన వారు తొమ్మిది, పది తరగతుల్లో పరీక్షలు రాయకుండా ఇంటర్‌కు వచ్చిన వారే. సెకండియర్ పాసైన వారు పది పరీక్షలు రాయలేదు. మొత్తానికి కరోనా బ్యాచ్‌గా పేరొందినా తాజా ఫలితాల్లో సత్తా చాటడం విశేషం
ఈనాడు, హైదరాబాద్: కరోనా మహమ్మారి విద్యార్థులను ఆగమాగం చేసినా విద్యా పరంగా వారు మళ్లీ కోలుకున్నారు! ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా ఉత్తీర్ణత శాతం కరోనాకు ముందు స్థాయిలోనే రావడం విశేషం. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ను పక్కనబెట్టి కేవలం జనరల్ ఇంటర్నే తీసుకుంటే ఆ శాతం వరుసగా 64.85, 68.68 శాతంగా నమోదైంది. గత డిసెంబరులో వెల్లడైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కేవలం 49 శాతం మందే పాస్ కాగా....తదనంతరం ప్రభుత్వం అందర్నీ ఉత్తీర్ణులను చేసింది. తాజా ఫలితాల్లో ఏకంగా 67 శాతానికిపైగా పాసయ్యారు. నాంపల్లి విద్యాభవన్‌లో మంగళవారం ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత ప్రథమ సంవత్సరం పరీక్షల్లో అధిక శాతం మంది తప్పారు. దాంతో అప్రమత్తమైన విద్యార్థులు బాగా చదివారు. అధ్యాపకులు కూడా కష్టపడ్డారు. దానివల్లే ఈసారి సెకండియర్‌లో ఉత్తీర్ణత పెరిగింది’’ అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల కంట్రోలర్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్‌కుమార్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజె తదితరులు పాల్గొన్నారు.
ఫలితాల ముఖ్యాంశాలు
* ప్రథమ సంవత్సరం జనరల్‌లో 4,14,380 మందిలో 1,76,992 మందికి 75, ఆపై శాతం మార్కులు(ఏ గ్రేడ్) దక్కాయి. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 3,92,258 మందికి 1,44,076 మంది ఏ గ్రేడ్ మార్కులు పొందారు.
* ఫస్టియర్‌లో అబ్బాయిలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వరుసగా 54.25, 72.33 శాతంగా నమోదైంది. సెకండియర్‌లో 59.21, 75.28 శాతంగా ఉంది. అంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 15-18 అధికం.
* ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, హనుమకొండ, కుమురంభీం ఆసిఫాబాద్ అగ్రస్థానాల్లో నిలిచాయి. ఫస్టియర్‌లో మేడ్చల్(76), హనుమకొండ(74), ఆసిఫాబాద్ 72 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ద్వితీయ ఇంటర్లో మేడ్చల్ 78 శాతంతో ప్రథమ, 77 శాతంతో ఆసిఫాబాద్, హనుమకొండ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి 75 శాతంతో మూడో స్థానంలో ఉంది. మెదక్ ప్రథమ సంవత్సరంలో 40 శాతం, ద్వితీయంలో 47 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో నారాయణపేట 75, 76 శాతాలతో అగ్రగామిగా ఉంది. ఒకేషనల్ ఫస్టియర్‌లో 34 శాతంతో జగిత్యాల, సెకండియర్‌లో 47 శాతంతో సిద్దిపేట అట్టడుగున నిలిచాయి.
ప్రైవేట్‌లో కంటే గురుకులాల్లో ఉత్తీర్ణత ఎక్కువ
ప్రథమ, ద్వితీయలలో ప్రభుత్వ కళాశాలల్లో వరుసగా 47.70, 63.56 శాతం మంది పాసయ్యారు. గురుకులాల్లో ఆ శాతం 73.30, 78.25గా నమోదైంది. ప్రైవేట్ కళాశాలల్లో అది 66.50, 68.30 శాతం.
* ప్రథమంలో 16, ద్వితీయలో 46 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు.
* హెచ్ఈసీ(చరిత్ర, ఆర్థికశాస్త్రం, పౌరశాస్త్రం) ఫస్టియర్‌లో 31.80 శాతం, సెకండియర్‌లో 45.70 శాతం మందే పాసయ్యారు.
* ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 50.70 శాతం, ద్వితీయంలో 60.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రయోగ పరీక్షలు జులై 26 నుంచి
తప్పిన విద్యార్థులకు ఆగస్టు 1నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు జులై 26 నుంచి 30 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 30-జులై 6మధ్య సంబంధిత కళాశాలల్లో రుసుం చెల్లించాలి. ప్రథమ సంవత్సరంలో అన్నీ పాసైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు.
గ్రూపుల వారీగా అగ్రగణ్యులు వీరే..
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఎంపీసీ గ్రూపులో 994 మార్కులతో ఇద్దరు, బైపీసీలో 993 మార్కులతో నలుగురు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కులు సాధించారు.
సెకండియర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి వివరాలు
* ఎంపీసీ గ్రూపు: ఎన్నం నవ్యశ్రీ(994)-కరీంనగర్, చిలుకా సాయి కీర్తన్(994)-నిజామాబాద్
* బైపీసీ గ్రూపు: ఆకుల అర్చన(993)-కరీంనగర్, మైసా మనస్వని(993)- బాచుపల్లి, రంగారెడ్డి జిల్లా, షేక్ నుహ తన్సీమ్(993)-సాయినగర్, కూకట్పల్లి, నేహ త్రిషిక(993)- సాయినగర్, కూకట్పల్లి మేడ్చల్ జిల్లా
* సీఈసీ గ్రూపు: షరీన్ బేగం(981)- ఫలక్‌నుమా, హైదరాబాద్ జిల్లా
* హెచ్ఈసీ గ్రూపు: నాంపల్లి నాగలక్ష్మి(977)-కొంపల్లి, మేడ్చల్ జిల్లా
* ఎంఈసీ గ్రూపు: గంట శ్రీ చక్రిత(986)- కరీంనగర్, పిల్లి హర్షిత(986)- హైదర్‌నగర్, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా; నేలబొట్ల సాయి మనోజ్ఞ(986)-లక్డీకాపుల్, హైదరాబాద్ జిల్లా
సర్కారు కళాశాలల్లో అగ్రగణ్యులు వీరే..
* ఎంపీసీ గ్రూపు: జెల్లా అమన్(990)- ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిర్పూర్ కాగజ్‌నగర్, కుమురం భీం జిల్లా. కొర్రా మేఘన సింధు(990)- ప్రభుత్వ కళాశాల హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా
* బైపీసీ గ్రూపు: మదిహ ఫిర్దోస్(983)- హైదరాబాద్ మలక్‌పేట ప్రభుత్వ బాలికల కళాశాల
* ఎంఈసీ: డీవీఎల్ఎన్ఎస్ మృదుల(961)- హైదరాబాద్ మారేడ్‌పల్లి జూనియర్ కళాశాల
* సీఈసీ: నూర్ ఫాతిమా(963)- కుత్బుల్లాపూర్ ప్రభుత్వ కళాశాల, మేడ్చల్ జిల్లా
* హెచ్ఈసీ: అఫ్రా తహూర్(926)- ప్రభుత్వ బాలికల కళాశాల, జగిత్యాల
రీకౌంటింగ్‌కు రేపటి నుంచి దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ పరీక్ష పత్రాల పునఃపరిశీలనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్‌బోర్డు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 30 నుంచి జులై 6లోపు http://tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పరీక్షపత్రాల రీకౌంటింగ్ కోసం ఒక్కో పత్రానికి రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన పరీక్షపత్రాలతోపాటు వెరిఫికేషన్ కోసం ఒక్కో పత్రానికి రూ.600 చొప్పున చెల్లించాలి.
11 నుంచి ఫస్టియర్ తరగతులు
రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను జులై 11 నుంచి ప్రారంభించాలని బోర్డు కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు బుధవారం కాలపట్టిక విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం(2022-23) రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు కాలేదని చెప్పారు.
ఎంపీసీలోనే అత్యధిక ఉత్తీర్ణత
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో మిగతా గ్రూపులతో పోల్చితే ఎంపీసీ విద్యార్థులే అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. హెచ్ఈసీ విద్యార్థులు అత్యల్ప ఉత్తీర్ణత పొందారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Electric bikes: కుషాయిగూడలో పేలిన రెండు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు.. భారీగా ఎగసిన మంటలు
-
General News
తెలంగాణలో రేపు సామూహిక జాతీయ గీతాలాపన.. 1నిమిషం పాటు రెడ్ సిగ్నల్
-
Movies News
Social Look: పారిస్ ప్రేమలో మెహరీన్.. ట్రెండ్ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్!
-
World News
Afghanistan: తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్.. ఏడాదైనా ఏకాకిగానే..!
-
Movies News
Bollywood Movies: బోల్తా కొడుతున్న బాలీవుడ్ మూవీలు.. కారణం అదేనా?
-
World News
Salman Rushdie: వారే కారణం..! రష్దీ దాడి ఘటనపై ఇరాన్ స్పందన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు