వైద్యవృత్తిలో సాధన, పరిశోధన ముఖ్యం

బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ద్వారా గ్రామీణులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుతున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశంలో ఎయిమ్స్‌ లాంటి సంస్థల విస్తరణతో పాటు అందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మాజీ ప్రధాని,

Published : 29 Jun 2022 03:53 IST

 వివాహం లక్ష్య సాధనకు అడ్డంకి కాదు

ఎయిమ్స్‌లో గవర్నర్‌ తమిళిసై

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ద్వారా గ్రామీణులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుతున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశంలో ఎయిమ్స్‌ లాంటి సంస్థల విస్తరణతో పాటు అందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మాజీ ప్రధాని, వాజ్‌పేయీ చేసిన కృషిని ప్రధాని నరేంద్రమోదీ కొనసాగిస్తున్నారని తెలిపారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో స్కిల్‌ల్యాబ్‌ను మంగళవారం గవర్నర్‌ ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, సంచాలకుడు వికాస్‌ భాటియా, అనస్థీషియా హెచ్‌వోడీ ఎస్‌.కళ్యాణి సూర్యధనలక్ష్మి, డీన్‌ రాహుల్‌ నారంగ్‌తో కలిసి అనుసంధాన్‌(ఇన్‌స్టిట్యూట్‌ రీసెర్చ్‌), ఆపరేషన్‌ స్వాస్థ్య(సర్జికల్‌ జర్నీ) మ్యాగజీన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ వైద్యవృత్తిలో సాధన, పరిశోధన ముఖ్యమని చెప్పారు. కొవిడ్‌ సమయంలో వైద్యులు, వైద్యవిద్యార్థులు విలువైన సేవలు అందించారని అభినందించారు.  వైద్యవిద్యార్థులు లక్ష్యం చేరుకునే వరకు వివాహం పట్ల ఆసక్తి చూపడం లేదని గవర్నర్‌ అన్నారు. తాను వైద్యవిద్యలో ఉండగా మొదటి సంవత్సరంలోనే వివాహమైనా లక్ష్యసాధనలో వెనుకంజ వేయలేదనని చెప్పారు. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల సంతానం, కాన్పు సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె గుర్తుచేశారు. ‘వైద్యవృత్తిలో ఉన్న అనుభవంతో గవర్నర్‌ తమిళిసై తన ఉపన్యాసాల ద్వారా విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపార’ని సంచాలకుడు వికాస్‌ భాటియా అన్నారు. 2019లో ప్రారంభమైన ఎయిమ్స్‌ ఇప్పుడు అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఆరునెలల్లో హృద్రోగ, నెఫ్రాలజీ, మరికొన్ని విభాగాలకు సంబంధించిన సూపర్‌స్పెషాలిటీ చికిత్సలు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమం అనంతరం ఆడిటోరియం నుంచి బయటకు వస్తున్న గవర్నర్‌ను ‘ప్రగతి భవన్‌కు రాజ్‌భవన్‌కు మధ్య దూరం పెరిగిందని ప్రజలు అనుకుంటున్నార’ని, ఓ మీడియా ప్రతినిధి అనగా ఈరోజు ఉదయం చూశారు కదా.. అంటూ గవర్నర్‌ చిరునవ్వుతో ముందుకు సాగారు. కార్యక్రమంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీరజ్‌ అగర్వాల్‌, భాజపా నాయకుడు గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని