ఫారెస్ట్‌ సర్వీస్‌లో తెలుగు అభ్యర్థుల హవా

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. పలువురు కొలువులు సాధించారు. యూపీఎస్‌సీ మంగళవారం ఐఎఫ్‌ఎస్‌-2021 ర్యాంకులను విడుదల చేసింది. 108 మంది సర్వీస్‌కు ఎంపికయ్యారు. తెలుగు

Published : 29 Jun 2022 03:53 IST

మూడో ర్యాంకు సాధించిన ప్రభంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, వరంగల్‌, ములుగు, న్యూస్‌టుడే: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. పలువురు కొలువులు సాధించారు. యూపీఎస్‌సీ మంగళవారం ఐఎఫ్‌ఎస్‌-2021 ర్యాంకులను విడుదల చేసింది. 108 మంది సర్వీస్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎ.ప్రభంజన్‌రెడ్డి-3వ ర్యాంకు, రమణకాంత్‌రెడ్డి- 34వ ర్యాంకు, కె.నాగరాజు-40, దొంతుల రేవంత్‌చంద్ర-81, కాసర్ల రాజు-86వ ర్యాంకు సాధించి కొలువులను దక్కించుకున్నారు. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు మరో నలుగురైదుగురు ఉన్నట్లు తెలుస్తోంది.

అన్న ఐఏఎస్‌.. తమ్ముడు ఐఎఫ్‌ఎస్‌

హనుమకొండ రెవెన్యూ కాలనీకి చెందిన దొంతుల రేవంత్‌ చంద్ర ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో 81వ ర్యాంకు సాధించారు. ఇతని సోదరుడు జెనిత్‌ చంద్ర మే 30న విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 201 సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వీరి స్వస్థలం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం అర్జునపట్ల. తండ్రి చంద్రమోహన్‌ హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖలో సహాయ కమిషనర్‌గా, తల్లి ప్రసన్నలక్ష్మి హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

అటవీ కళాశాల విద్యార్థికి 86వ ర్యాంకు

ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రం విద్యార్థి కాసర్ల రాజు తొలి ప్రయత్నంలోనే 86వ ర్యాంకు సాధించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌ విద్యార్థిని అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జనగామ జిల్లా సూరారం గ్రామానికి చెందిన అంజయ్య, శోభ దంపతులకు రాజు ప్రథమ కుమారుడు. తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి కూలీ పనులు చేస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని