మానసిక వైద్యశాలలో ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాల్సిందే

హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. మానసిక వైద్యశాల ఆవరణలో గృహాలు నిర్మించారని, కనీసం కొంచెం

Published : 29 Jun 2022 03:53 IST

సుప్రీంకోర్టు

దిల్లీ: హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. మానసిక వైద్యశాల ఆవరణలో గృహాలు నిర్మించారని, కనీసం కొంచెం స్థలాన్నైనా ఖాళీగా వదిలేయాలంటూ సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా తీర్పు వెలువరించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆక్రమించిన స్థలాన్ని రెండు నెలల్లో ఖాళీ చేయాలని వారు స్పష్టంచేశారు. ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయాలంటూ అమీర్‌పేట తహసీల్దార్‌ గత ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు జూన్‌ 14న కొట్టివేసింది. దీనిపై పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆసుపత్రిలోని రోగుల జీవితాలను దయనీయంగా మార్చడం సరికాదని పేర్కొంది. ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేసేందుకు వారికి రెండు నెలల సమయమిచ్చింది. రెండు నెలలు గడవగానే స్థలాన్ని శాంతియుతంగా అప్పగిస్తామంటూ హైకోర్టుకు వారం రోజుల్లోపు హామీ ఇవ్వాలనీ ఆదేశించింది. ఆక్రమణలో ఉన్న స్థలం తమదేనని నిరూపించేందుకు పిటిషన్‌దారుల వద్ద టైటిల్‌ హక్కులు, లీజ్‌ డీడ్‌, చట్టబద్ధమైన పత్రాలేవీ లేవని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్థలంలో 45 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నాయని, దాన్ని ఖాళీ చేసేందుకు కొంత సమయమివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అంతకుముందు కోర్టును అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు