5జీ రంగంలో..సర్టిఫికెట్‌ ప్రోగ్రాం

ఐఐటీ హైదరాబాద్‌, వైసిగ్‌ అంకుర సంస్థలు కలిసి సరికొత్త సర్టిఫికెట్‌ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ‘భవిష్యత్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌’ అంశం ఆధారంగా 12 నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులా దీనిని రూపొందించాయి.

Published : 29 Jun 2022 05:15 IST

వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో ఏడాది వ్యవధి కోర్సు

అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఐటీ హైదరాబాద్‌

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌, వైసిగ్‌ అంకుర సంస్థలు కలిసి సరికొత్త సర్టిఫికెట్‌ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ‘భవిష్యత్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌’ అంశం ఆధారంగా 12 నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులా దీనిని రూపొందించాయి.

ఐఐటీ హైదరాబాద్‌ దేశంలోనే తొలిసారిగా 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో ఈ రంగంలో పనిచేసే వారికి ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఈ క్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిలో ఆ మేరకు నైపుణ్యాలను పెంచేందుకు ఈ కోర్సు దోహదపడనుంది. ఆగస్టు 1 నుంచి తరగతులు మొదలు కానున్నాయి. జులై 10తో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ప్రతిభ కనబర్చిన వారికి ప్రతినెలా రూ.25వేల స్కాలర్‌షిప్‌ కూడా అందించనున్నారు. ఏటా 500 మంది ఇంజినీర్లను సుశిక్షితులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కోర్సుకు రూపకల్పన చేశారు. 50 వరకు ప్రీప్లేస్‌మెంట్‌ ఆఫర్లు దక్కేలా చూడనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 6జీపైనా పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 200 మందికి ఈ పరిశోధన, అభివృద్ధి విభాగంలో అవకాశాలు కల్పించనున్నారు. 5జీ సాంకేతికత రంగంలో మానవవనరుల కొరతను అధిగమించేందుకు ఈ కోర్సు దోహదం చేస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ సంచాలకుడు ఆచార్య బీఎస్‌ మూర్తి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌లలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులని ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్‌ జీవీవీ శర్మ ఆ ప్రకటనలో వివరించారు. 4 మాడ్యూళ్ల ఈ ప్రోగ్రాంలో ఒకటి పూర్తయినా ఆ మేరకు ధ్రువపత్రం తీసుకుని బయటకు వెళ్లడానికి అవకాశం ఉంది. మరిన్ని వివరాలను  fcw.iith.ac.in  ద్వారా తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని