Updated : 30 Jun 2022 07:31 IST

GST: అప్పడాలు, మజ్జిగపైనా జీఎస్టీ మోత

ప్యాక్‌ చేసి లేబుల్‌ వేస్తే 5 శాతం పన్ను

మాంసం, చేపలపైనా బాదుడే

జులై 18 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి

జీఎస్టీ మండలి నిర్ణయం

ఈనాడు వాణిజ్య విభాగం

ప్యాక్‌ చేసిన లేబుల్డ్‌ గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్‌, పెరుగు, మజ్జిగ - లస్సీ, మాంసం (ఫ్రోజెన్‌ మినహాయించి), చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు-మఖానా, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్‌ పైనా ఇక నుంచి 5 శాతం జీఎస్టీ పడుతుంది. బుధవారం జరిగిన జీఎస్టీ మండలి 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కొత్తపన్ను రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ.1000 కంటే తక్కువ విలువైన హోటల్‌ గదుల అద్దెపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తారు. ఆసుపత్రిలో ఒక రోగికి రూ.5000కి మించి గది అద్దె తీసుకుంటే, ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ పడనుంది. బ్యాటరీ ప్యాక్‌ అమర్చినా, లేకున్నా విద్యుత్తు వాహనాలకు 5 శాతం జీఎస్టీ ఖరారు చేశారు. 

ఇవి పెరిగాయి..

* ప్రింటింగ్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌లపై పన్ను 12 నుంచి 18 శాతానికి పెంపు

* కత్తులు, కటింగ్‌ బ్లేడ్లు, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ చెక్కుకునే షార్ప్‌నర్లపైనా 18% పన్ను

* ఎల్‌ఈడీ లైట్లు, ఫిక్సర్‌, వాటికి వినియోగించే మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌బోర్డులపై 12 నుంచి 18 శాతానికి

* సోలార్‌ వాటర్‌ హీటర్‌, సిస్టంపై 5 నుంచి 12 శాతానికి

* చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌వర్క్‌లపై 5 నుంచి 12 శాతానికి

* రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్టు వర్కులపై 12 నుంచి 18 శాతానికి

* టెట్రా ప్యాక్‌పై 12 నుంచి 18 శాతానికి

* కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాలపై 0.25 నుంచి 1.5 శాతానికి

* చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జీపై 18% జీఎస్టీ

* మ్యాప్‌లు, ఛార్టులు, అట్లాస్‌పై 12 శాతం పన్ను

ఇవి తగ్గాయి..

* కొన్ని ఆర్థోపెడిక్‌ ఉపకరణాలకు పన్నురేటు 12-5 శాతానికి తగ్గింపు

* రోప్‌వే ద్వారా ప్రయాణికులు, సరకు చేరవేత సేవలపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు

* ఇంధనం ధర కలిపి అద్దెకు తీసుకునే ట్రక్‌, సరకు రవాణా వాహనాల అద్దెపై పన్ను 18 నుంచి 12 శాతానికి తగ్గింపు

ఇవీ గమనించాలి

* ప్యాక్‌ చేయని, లేబుల్‌ వేయని, అన్‌బ్రాండెడ్‌ ఉత్పత్తులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది.

* ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏ, సెబీ వంటి నియంత్రణ సంస్థల సేవలపైనా పన్ను విధిస్తారు. వ్యాపార సంస్థలకు ఇచ్చే నివాసాలకూ జీఎస్టీ వర్తిస్తుంది.

* ఈ-కామర్స్‌ సంస్థలకు వస్తువులు సరఫరా చేసే చిన్న వ్యాపారుల టర్నోవర్‌ రూ.40 లక్షల్లోపు ఉంటే జీఎస్టీ కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందువల్ల రాష్ట్రాల మధ్య వస్తు సరఫరా ఈ-కామర్స్‌ పోర్టళ్ల ద్వారా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2023 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts