Published : 30 Jun 2022 03:42 IST

క్యాన్సర్‌ బాధితులకు భరోసా

 ఎంఎన్‌జేలో రోబోటిక్‌ సహా మరో 8 శస్త్ర చికిత్స గదులు సిద్ధం

కొత్తగా 300 పడకలు అందుబాటులోకి

త్వరలో ప్రారంభానికి వైద్యశాఖ సన్నాహకాలు

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ఎనిమిదేళ్లలో ఈ చికిత్సల కోసమే రూ.753 కోట్లు వెచ్చించగా, తాజాగా మరో రూ.30 కోట్లతో అత్యాధునిక శస్త్ర చికిత్స గదులను సిద్ధం చేసింది.

ప్రభుత్వ వైద్యంలో నిమ్స్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో కేన్సర్‌ బాధితులకు చికిత్సలు లభిస్తున్నాయి. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రతినెలా ఎనిమిది మందికి, ఎంఎన్‌జేలో ఇద్దరికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి(బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌) శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోగుల తాకిడి దృష్ట్యా సేవలను మరింత విస్తరించే క్రమంలో వైద్యారోగ్యశాఖ ఎంఎన్‌జేలో కొత్తగా అత్యాధునిక సౌకర్యాల(మాడ్యులర్‌)తో ఎనిమిది శస్త్రచికిత్స గదులను సిద్ధంచేసింది. ఇందులో ఒకటి రోబోటిక్‌ది. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా వీటిని సిద్ధం చేశారు. ఒక్కో దానికి రూ.3-3.5 కోట్ల చొప్పున సుమారు రూ.30 కోట్ల వరకూ వెచ్చించారు. ప్రతి దానికీ అనుబంధంగా మినీ ఐసీయూ, శస్త్రచికిత్స అనంతరం పర్యవేక్షణ గదిని సిద్ధంచేశారు. ముఖ్యంగా ఎముక మూలుగ మార్పిడి శస్త్ర చికిత్సల కోసమే ఒక థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 10 గదులతో ఒక అంతస్తు మొత్తాన్నీ దీనికే కేటాయించారు. వీటితోపాటు మరో 300 పడకలతో అయిదు అంతస్తుల నూతన భవనం కూడా సిద్ధమైంది. వచ్చే 7-10 రోజుల్లో వీటిని ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

తగ్గనున్న వేచిచూసే సమయం

ప్రస్తుతం రోగుల తాకిడి దృష్ట్యా ఎంఎన్‌జేలో శస్త్ర చికిత్సల కోసం ఒక్కో రోగి కనీసం రెండు, రెండున్నర నెలల వరకూ వేచి చూడాల్సి వస్తోంది. ఎనిమిది శస్త్ర చికిత్స గదులు అందుబాటులోకి వస్తే, రోగులు వేచి చూసే కాలం తగ్గుతుంది. రోజుకు సుమారు 40 శస్త్ర చికిత్సలు వరకూ చేయడానికి అవకాశాలుంటాయి. ‘‘ఇంతటి అధునాతన సదుపాయాలతో శస్త్ర చికిత్స గదులు రూపొందించడం ప్రభుత్వ వైద్యంలో ఇదే తొలిసారి. ప్రస్తుతం ప్రైవేటులో క్యాన్సర్‌ శస్త్ర చికిత్సలకు రోగులు రూ.లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అదే వైద్యం ఉచితంగా అందించవచ్చు. పైపెచ్చు శస్త్ర చికిత్స గదుల్లోకి గాలి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లుచేశాం. దీనివల్ల లోపలి వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశాలు స్వల్పం. రోబోటిక్‌ థియేటర్‌ వల్ల తక్కువ సమయంలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు నిర్వహించడం సాధ్యమవుతుందని’  వైద్యవర్గాలు తెలిపాయి. త్వరలో మాలిక్యులర్‌ ఆంకాలజీ, పరిశోధన విభాగం కూడా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని