రోజూ 2500 పాస్‌పోర్టుల జారీ!

పాస్‌పోర్టుల జారీలో జాప్యం నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని... మరో నెలన్నర రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి (ఆర్పీవో) దాసరి బాలయ్య తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌లలో ఎదురవుతున్న

Published : 30 Jun 2022 03:42 IST

 అయినా కేటాయిస్తున్న స్లాట్లు సరిపోవడం లేదు

వేగంగా జారీ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం

సందేహాల నివృత్తికి ‘చాట్‌ విత్‌ ఆర్‌పీవో’

‘ఈనాడు’ ముఖాముఖిలో రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య

ఈనాడు - హైదరాబాద్‌

పాస్‌పోర్టుల జారీలో జాప్యం నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని... మరో నెలన్నర రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి (ఆర్పీవో) దాసరి బాలయ్య తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌లలో ఎదురవుతున్న సమస్యలు, అత్యవసర ప్రయాణాలు చేసేవారి కోసం తీసుకున్న చర్యల గురించి ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన వివరించారు.

పాస్‌పోర్టు స్లాట్‌ల కేటాయింపుల సమయం రెండు నెలల వరకు ఉండడానికి ప్రధాన కారణం కరోనా ప్రభావమే. రెండేళ్లపాటు పెద్దగా దరఖాస్తులు రాలేదు. కరోనా తగ్గుముఖం పట్టడం, విదేశీ ప్రయాణాలకు అనుమతి లభించడంతో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో సేవా కేంద్రాల వారీగా కేటాయిస్తున్న స్లాట్లు సరిపోవడం లేదు. ప్రస్తుతం వీలైనంత వేగంగా మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాం. రోజూ 2500 పాస్‌పోర్టులు జారీ చేస్తున్నాం. సెలవు రోజైన శనివారమూ సిబ్బందిని నియమించి పని చేయిస్తున్నాం.

అత్యవసరమైన వారికి ప్రత్యేక కౌంటర్‌..

అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారి అభ్యర్థనలు స్వీకరించడానికి సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశాం. విద్య, ఉపాధి, అత్యవసర వైద్యం కోసం వెళ్లేవారు సంబంధింత డాక్యుమెంట్లు తీసుకుని వస్తే వారం రోజుల్లో మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఈ కౌంటర్‌లో సేవలు అందిస్తున్నాం. రోజూ 150-200 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవలే 9 రోజుల శిశువుకు కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు ధ్రువీకరించడంతో చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లాల్సి వస్తే దరఖాస్తును ప్రాసెస్‌ చేసి గంటలోనే పాస్‌పోర్టు జారీ చేశాం. ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేఘటనలో కొన్ని పాస్‌పోర్టులు పూర్తిగా దగ్ధమైతే వెంటనే పునర్ముద్రించి వారికి చేరే ఏర్పాట్లు చేశాం.

100శాతం అపాయింటుమెంట్లు

పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో 100శాతం అపాయింట్‌మెంట్లు ఇస్తున్నాం. అమీర్‌పేట్‌లో 690, బేగంపేట్‌లో 865, నిజామాబాద్‌లో 305, టోలిచౌకిలో 761, ఆర్పీవో హైదరాబాద్‌ 100, ఆదిలాబాద్‌ 40, భువనగిరి 40, కామారెడ్డి 40, ఖమ్మం 80, మహబూబ్‌నగర్‌ 50, మహబూబాబాద్‌ 40, మంచిర్యాల 40, మెదక్‌ 40, మేడ్చల్‌ 50, నల్గొండ 50, సిద్దిపేట 40, వికారాబాద్‌ 40, వనపర్తి 40, వరంగల్‌ 80, కరీంనగర్‌ 210 అపాయింట్‌మెంట్లు ఇస్తున్నాము. ఇవి కాకుండా ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకునేవి అదనం.

వాయిదా వేసుకోవడం మంచిది..

కొందరు ప్రయాణానికి టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పాస్‌పోర్టు ఎక్స్‌పైరీ అయిందంటూ కంగారు పడుతున్నారు. అత్యవసరం కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.


సందేహాలా.. సంప్రదించండి

దరఖాస్తుదారుల ఫిర్యాదులు, సందేహాల నివృత్తి కోసం ప్రతి మంగళవారం ‘ఛాట్‌ విత్‌ ఆర్పీవో’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు 81214 01532 నంబర్‌లో వాట్సప్‌ ద్వారా సంప్రదించొచ్చు. దరఖాస్తుదారులు సందేశాల ద్వారా తమ అభ్యర్థనను తెలిపితే ప్రత్యక్షంగా పర్యవేక్షించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని