Published : 30 Jun 2022 03:42 IST

హైదరాబాద్‌ను ఏపీలో చూపుతున్నారు

చిరునామాలు మార్చకపోవడంతో రాబడి కోల్పోతున్నాం

జీఎస్టీ మండలి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన జరిగినా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారుల చిరునామాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో తెలంగాణ పన్ను రాబడిని కోల్పోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు జీఎస్టీ మండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లుగా చూపుతున్నారని చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన జరిగి  ఎనిమిదేళ్లయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదేళ్లయింది. పన్ను చెల్లింపుదారులు తెలంగాణలోనే ఉన్నా చిరునామాలో మాత్రం ఏపీలోనే ఉన్నట్లుగా పరిగణిస్తున్నారు’’ అని వివరించారు. చండీగఢ్‌లో మంగళ, బుధవారాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నులశాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడిన అంశాలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘‘జీఎస్టీఆర్‌-3 బీ రిటర్న్‌లలో ప్రతికూల విలువలను అనుమతించాలని ప్రతిపాదించినందుకు మండలికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పన్ను చెల్లింపుదారుల చిరునామాలలో తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు మళ్లించిన ఐజీఎస్టీని రికవరీ చేయడానికి రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల అంశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల సహకారం కావాలని కోరారు. ఈ అంశంలో కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి.. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన స్వచ్ఛ పరికరాలకు పన్ను మినహాయిపుల జాబితాను విస్తరించాలని కోరారు. స్థానిక సంస్థలు ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఈ నేపథ్యంలో వాటిపై భారాన్ని తగ్గించాలని మండలి దృష్టికి తెచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న మండలి.. అధ్యయనం కోసం ఫిట్‌మెంట్‌ కమిటీకి పంపి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించింది. జీఎస్టీ అప్పిలేట్‌ ప్రతిపాదించిన నిబంధనలు గందరగోళంగా, ఆచరణకు వీలుగాలేవని హరీశ్‌రావు పేర్కొనగా కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించారు. ఈ నిబంధనల అంశాన్ని మంత్రుల కమిటీకి అప్పగించారు. దీనిపై ఆగస్టు ఒకటో తేదీలోపు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. గోవా అభ్యర్థనను అంగీకరించి క్యాసినోల జీఎస్టీని ఆమోదించినట్లు గుర్రపు పందేల అంశంలోనూ నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరగా దీన్ని అంగీకరించిన ఛైర్‌పర్సన్‌ ఈ అంశంపై జులై 15 లోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు’’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.

చండీగఢ్‌ పీజీఐని సందర్శించిన వైద్య మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ‘చండీగఢ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి’ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం సందర్శించారు. చండీగఢ్‌లో జరుగుతున్న జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన వైద్య మంత్రి పీజీఐ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్‌ వివేక్‌లాల్‌, డీన్‌ డాక్టర్‌ పురి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వివేక్‌ కౌశల్‌ తదితరులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. ఆసుపత్రిలో అందిస్తోన్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆరోగ్య రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వైద్య మంత్రి వారికి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశంలో హైదరాబాద్‌లో నిమ్స్‌ విస్తరణ, నగరం నలువైపులా టిమ్స్‌ పేరిట నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లో వెయ్యి పడకలతో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు తదితర అంశాలను వివరించారు. మరింత మెరుగైన వసతులు, సేవలు అందించడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఈ సందర్భంగా పీజీఐ చండీగఢ్‌ నిపుణుల నుంచి స్వీకరించారు. మంత్రి వెంట వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, నిమ్స్‌ సంచాలకుడు డాక్టర్‌ మనోహర్‌ తదితరులున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని