Published : 30 Jun 2022 03:42 IST

ఎసైన్డ్‌ భూముల అప్పగింత

జమునా హేచరీస్‌ ఆక్రమణలో ఉన్నవాటికి పట్టాల పంపిణీ

అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు

ఈనాడు, మెదక్‌; న్యూస్‌టుడే, వెల్దుర్తి: భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ ఆక్రమణలోని ఎసైన్డ్‌ భూములను రెవెన్యూ అధికారులు తిరిగి లబ్ధిదారులకు అప్పగించారు. గతంలో సాగిన విచారణల్లో 8 సర్వే నంబర్లలో ఉన్న 85.19 ఎకరాల భూమిని ఈ సంస్థ ఆక్రమించినట్లు తేల్చారు. 65 మంది లబ్ధిదారులకు మళ్లీ ఈ భూమిని తిరిగిచ్చే కార్యక్రమాన్ని బుధవారం మొదలుపెట్టారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలలో ఉన్న ఈ భూముల వద్దకు ఉదయాన్నే మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌ రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్‌, ఉపేందర్‌రెడ్డి చేరుకున్నారు. స్థానిక రెవెన్యూ యంత్రాంగం సాయంతో లబ్ధిదారులు ఒక్కొక్కరికి భూమిని చూపిస్తూ హద్దులు నిర్ణయించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తొమ్మిది మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగతా వారికి రెవెన్యూ అధికారులు హద్దులు చూపిస్తూ.. పట్టాలను అందించారు. వాస్తవానికి 65 మందికి ఒక్కరోజులోనే హద్దులు చూపి పత్రాలు ఇవ్వాలని అధికారులు కార్యాచరణ రూపొందించారు. ముగ్గురు లబ్ధిదారులు అందుబాటులో లేరు. దీంతో 62 మందికి 84.19 ఎకరాలను అప్పగించే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సర్వే నంబరు 130లో షెడ్లు అలాగే...

అచ్చంపేట పరిధిలోని సర్వే నంబరు 130లో కొంత విస్తీర్ణంలో హేచరీస్‌కు సంబంధించిన షెడ్లున్నాయి. అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ షెడ్లను కూల్చివేస్తారనే ప్రచారం సాగింది. అయితే అధికారులు ఈ భూములను గతంలో పొందిన వారికి తిరిగి హద్దులు చూపించి పత్రాలు ఇచ్చారు. న్యాయస్థానం అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు మాలతి వివరించారు. షెడ్లు నిర్మించిన వైపు తమను భూముల్లోకి వెళ్లకుండా జమునా హేచరీస్‌ సిబ్బంది అడ్డుకుంటున్నారని లబ్ధదారులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తెచ్చారు. భూములను తిరిగి అప్పగించే క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో భారీగా పోలీసులను మోహరించారు. మాసాయిపేట, వెల్దుర్తి మండలాలకు చెందిన భాజపా స్థానిక నేతలను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకొని సాయంత్రం వదిలిపెట్టారు. ఈ మండలాల భాజపా ఇన్ఛార్జి రఘువీరారెడ్డి జమునా హేచరీస్‌ వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుట్రతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఆయనను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని