మిల్లర్లతో మిలాఖత్‌

నిర్దేశించిన లక్ష్యాలను తోసిరాజని అధికారులు మిల్లర్ల నుంచి వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకుని ప్రభుత్వంపై అదనపు భారం మోపారు. నిబంధనలకు నీళ్లొదిలిన పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లకు(డీఎంలకు) ఉన్నతాధికారులు

Published : 30 Jun 2022 06:18 IST

ఇష్టారాజ్యంగా బియ్యం సేకరణ
15 మందికిపైగా పౌరసరఫరాల సంస్థ డీఎంలకు నోటీసులు!

ఈనాడు, హైదరాబాద్‌: నిర్దేశించిన లక్ష్యాలను తోసిరాజని అధికారులు మిల్లర్ల నుంచి వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకుని ప్రభుత్వంపై అదనపు భారం మోపారు. నిబంధనలకు నీళ్లొదిలిన పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లకు(డీఎంలకు) ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఏడాదిన్నరకుపైగా సరిపోయే బియ్యం పౌరసరఫరాల సంస్థ వద్ద ఉన్నాయి. బియ్యం ఎక్కువ నిల్వ చేస్తే పురుగులు పడతాయి. రాష్ట్రంలో నెలకు 1.81 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేయాలి. అందులో 1.08 లక్షల మెట్రిక్‌ టన్నులు కేంద్రం, మిగిలిన 73 వేలు రాష్ట్రం భరించాలి. ఇందుకోసం ఒక్క హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో కార్డుల సంఖ్య ఆధారంగా బియ్యం సేకరణ లక్ష్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఆయా జిల్లా మేనేజర్లకు నిర్దేశిస్తుంది.

90 వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా

గడిచిన రెండేళ్ల వ్యవధిలో నిర్ధారిత లక్ష్యం కన్నా సుమారు 90 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 15 నుంచి 17 జిల్లాలకు చెందిన మేనేజర్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. కేంద్రానికి నివేదికలు పంపే క్రమంలో పలు జిల్లాల్లో సేకరించిన బియ్యానికి, లక్ష్యాలకు మధ్య పొంతన లేకపోవడం  పౌరసరఫరాల భవన్‌ అధికారుల దృష్టికి వచ్చింది. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి కస్టం మిల్లింగ్‌ విధానంలో బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. కానీ పలువురు అధికారులు, కొందరు మిల్లర్లు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా అదనపు బియ్యాన్ని సేకరించటంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం మోపినట్లు అయింది. ఆయా జిల్లాల అధికారులకు శాఖాపరంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే’నని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని