గాయాలు మానేది గాల్జి బంధంతో!

మన శరీరానికి ఏదో సందర్భంలో గాయాలవుతుంటాయి.. పుండ్లు పడుతుంటాయి. వారం, పది రోజులకు అవి నయమవుతుంటాయి. కొద్ది రోజులకు ఆ గాయం ఆనవాళ్లే కనిపించవు. ఇదెలా సాధ్యమవుతోందని ఎప్పుడైనా ఆలోచించారా?

Published : 30 Jun 2022 06:18 IST

గుర్తించిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు

ఈనాడు, హైదరాబాద్‌: మన శరీరానికి ఏదో సందర్భంలో గాయాలవుతుంటాయి.. పుండ్లు పడుతుంటాయి. వారం, పది రోజులకు అవి నయమవుతుంటాయి. కొద్ది రోజులకు ఆ గాయం ఆనవాళ్లే కనిపించవు. ఇదెలా సాధ్యమవుతోందని ఎప్పుడైనా ఆలోచించారా? అవయవాలపై ఉండే ఎపిథిలియల్‌ అనే ప్రత్యేక కణాలు గాయాలు లేదా పుండ్లు అయినచోట తిరిగి చర్మం ఏర్పడేందుకు కారణమవుతున్నాయి. ఈ కణాల్లో గాయం నయమయ్యే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనే విషయంపై హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు అధ్యయనం చేశారు. బయోఫిజిక్స్‌ ఆచార్యుడు తమల్‌దాస్‌ పర్యవేక్షణలో విద్యార్థి పుర్నాటి కుంతియా పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చర్మం సహా శరీరంలోని వివిధ అవయవాలపై ఎపిథిలియల్‌ కణాలతో కూడిన పొర ఉంటుంది. ఈ కణాల్లో గాల్జి అనే పదార్థం కణ కేంద్రకానికి పైభాగంలో ఉంటుంది. గాయాలు లేదా పుండ్లు నయమయ్యే సమయంలో గాల్జి పదార్థం కణ కేంద్రక పైభాగం నుంచి ముందుభాగంలోకి వస్తుంది. ఈ ప్రక్రియను పరిశోధకులు ‘మైగ్రేషన్‌ ఇండ్యూస్‌డ్‌ గాల్జి అపరాటస్‌ రీమోడలింగ్‌ (మిగర్‌)’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది.. ఎలా జరుగుతోందనే విషయం ఏళ్ల తరబడిగా పరిశోధకులకు అంతుచిక్కడం లేదు. ఈ సందిగ్ధతకు టీఐఎఫ్‌ఆర్‌ పరిశోధకులు తెరదించారు. మిగర్‌ ప్రక్రియ జరిగే క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. కణంలోనే ఉండే యాక్టిన్‌ అనే ప్రొటీన్‌తో గాల్జి పదార్థం బంధం ఏర్పరచుకుంటోందని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల కణ ముందుభాగంలోకి గాల్జి పదార్థం చేరుకుంటోందని, దానివల్లే కణాల విభజన జరిగి త్వరగా గాయం లేదా పుండు నయమవుతున్నట్లు గుర్తించారు. గాల్జి పదార్థం, యాక్టిన్‌ ప్రొటీన్‌ మధ్య బంధం బలహీనంగా ఉంటే పుండు నయమయ్యే ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని తేల్చారు. తమ పరిశోధన భవిష్యత్తులో ఎంతో కీలకం కానుందని, అవసరమైన ఔషధాల తయారీకి కీలకమవుతుందని ఆచార్యుడు తమల్‌దాస్‌ చెప్పారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’లో ప్రచురితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని