Published : 01 Jul 2022 06:05 IST

రెవెన్యూ సంఘాల నిరసన బాట

రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల ఎదుట వీఆర్‌ఏల ధర్నా

జులై 9 నుంచి సమ్మెలోకి.. 

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూ సంఘాలు ఒక్కొక్కటి ఆందోళన బాట పడుతున్నాయి. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలపై సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగ క్రమబద్ధీకరణ, పేస్కేలు వర్తింపు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. గత నెల 21న సైతం ఈ ఉద్యోగులు హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అలానే జులై 9 నుంచి సమ్మెకు వెళుతున్నట్లు ఇప్పటికే వీఆర్‌ఏ ఐకాస ప్రకటించింది. అదే బాటలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు), ఇతర ఉద్యోగులు నిరసనలకు సిద్ధమవుతున్నారు.

ఆరు నెలలుగా ఆందోళనలు

రాష్ట్రంలో 22 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు ఉన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తామని, పేస్కేలు వర్తింపజేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. వీఆర్‌ఏల కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ హామీలు అమలుకాకపోవడంతో ఆరు నెలలుగా వీఆర్‌ఏలు దశలవారీగా ఆందోళన ప్రారంభించారు.

వీఆర్వోల సర్దుబాటుపైనా..

2020 సెప్టెంబరులో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దుతో రాష్ట్రంలో 5,485 మంది వీఆర్వోలు జాబ్‌ఛార్ట్‌ లేకుండా తహసీల్దారు కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి వీరికి పదోన్నతులు, కారుణ్య నియామకాలు నిలిచిపోయాయి. వీఆర్వోలను పదోన్నతి ద్వారా సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపిక చేయాల్సి ఉండగా.. కొన్ని శాఖల్లో ఆ కోటా స్థానాలను ఇతరులతో భర్తీ చేస్తున్నారని ఆ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

ట్రెసా సైతం.. డిప్యూటీ తహసీల్దారు(డీటీ) నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకు పదోన్నతుల కల్పనలోనూ తాత్సారం చేస్తున్నారంటూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) అసంతృప్తితో ఉంది.

సేవలు స్తంభించే ప్రమాదం!

కలెక్టర్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించే వ్యవస్థల్లో రెవెన్యూ యంత్రాంగమే కీలకం. వీఆర్‌ఏల ద్వారానే గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రచారం, భూముల పరిరక్షణ, కబ్జాల సమాచారం.. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, రెండు పడక గదుల గృహాల లబ్ధిదారుల్లో అర్హుల ఎంపిక వంటి విచారణలు కొనసాగుతున్నాయి. కలెక్టర్లు తహసీల్దారుపై ఆధారపడి ప్రతి ప్రభుత్వ పథకం అమలును, ప్రగతిని పర్యవేక్షిస్తుంటారు. వీఆర్‌ఏలు సమ్మెకు దిగితే తహసీల్దార్లకు సమాచారం నిలిచిపోతుంది. అక్కడి నుంచి కలెక్టర్‌కు, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. భూముల క్రమబద్ధీకరణ, భూసేకరణ, విపత్తుల నిర్వహణ వంటి కీలకమైన విధులను సైతం రెవెన్యూ సిబ్బందే నిర్వర్తిస్తుంటారు. ఈ యంత్రాంగం ఆందోళనకు దిగితే సేవలు స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని