బీటెక్‌ రుసుంల నిర్ణయాధికారం మాదే

బీటెక్‌ వార్షిక రుసుంలను నిర్ణయించడంలో మాదే తుది నిర్ణయమని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)..అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి తేల్చిచెప్పింది. ఏఐసీటీఈ సిఫారసులను అమలు

Published : 01 Jul 2022 06:10 IST

మీ సిఫారసులు అమలుచేయలేం

ఏఐసీటీఈకి తేల్చిచెప్పిన టీఏఎఫ్‌ఆర్‌సీ

4వతేదీ నుంచి ఖరారు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ వార్షిక రుసుంలను నిర్ణయించడంలో మాదే తుది నిర్ణయమని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)..అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి తేల్చిచెప్పింది. ఏఐసీటీఈ సిఫారసులను అమలు చేయలేమని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే లేఖ రాసింది. బీటెక్‌ రుసుంల ఖరారు ప్రక్రియను టీఏఎఫ్‌ఆర్‌సీ మే నెల 16నే ప్రారంభించింది. అన్ని కళాశాలల యాజమాన్యాలకు సమాచారమిచ్చింది. అదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల ఆధారంగా కనిష్ఠ, గరిష్ఠ రుసుంలను నిర్ణయించాలని ఏఐసీటీఈ అన్ని రాష్ట్రాలను ఆదేశించడంతో ఈ క్రతువును నిలిపివేసింది. ఇటీవల ఈ విషయమై చర్చించిన టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు కొద్ది రోజుల క్రితం ఏఐసీటీఈకి లేఖ రాశారు. ‘‘ఇంజినీరింగ్‌ సహా ఇతర వృత్తి విద్యా కోర్సులకు శ్రీకృష్ణ కమిటీ ఏడో వేతన సంఘం ఆధారంగా రుసుంలను నిర్ణయించింది. రాష్ట్రంలో రెండు మూడు కళాశాలలు తప్ప ఆ ప్రకారం సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఆ కమిటీ నిర్దేశించిన ప్రకారం నిర్ణయించడం ఎలా సాధ్యమవుతుంది. వాస్తవంగా ఇంజినీరింగ్‌ వార్షిక రుసుంలను నిర్ణయించడంలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీలదే తుది నిర్ణయమని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఏఐసీటీఈకి ఆ అధికారం దక్కాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది’’ అని లేఖలో పేర్కొంది. అందువల్ల శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను అమలుచేయలేమని, తమ విధానం ప్రకారమే ఖరారు చేస్తామని తెలిపింది. ఏఐసీటీఈ నుంచి దానికి తిరుగు సమాధానం రాకపోవడంతో ఖరారు ప్రక్రియను ప్రారంభించాలని టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు తాజాగా నిర్ణయించారు. అందుకు అనుగుణంగా జులై 4 నుంచి 15వతేదీ లోపు 145 కళాశాలల వార్షిక రుసుంలను నిర్ణయించేందుకు టీఏఎఫ్‌ఆర్‌సీ సిద్ధమైంది. ఈ మేరకు గురువారం షెడ్యూల్‌ జారీచేసింది. ఆ ప్రకారం ఒక్కో కళాశాలకు 10-15 నిమిషాల సమయం ఇచ్చి ఖరారు చేసిన మొత్తంపై యాజమాన్యాల నుంచి అభ్యంతరాలు తెలుసుకుంటారు. వాటిని పరిగణనలోకి తీసుకుని అప్పటికప్పుడు ఒక మొత్తాన్ని నిర్ణయిస్తారు. దీనిపై టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారి ఒకరు మాట్లాడుతూ గతంలో కొన్ని కళాశాలలకు ఖరారు చేసిన ఫీజుల్లో మార్పు ఉండదని తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను అమలుచేస్తే బీటెక్‌కు కనీస రుసుం రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,800 అవుతుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని