అధికార భాషా సంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి

రాష్ట్రంలో మరో మూడు ప్రభుత్వరంగ సంస్థలకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ఆహార సంస్థ (టీఎస్‌ ఫుడ్స్‌) ఛైర్మన్‌గా మేడె రాజీవ్‌సాగర్‌, రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి,

Published : 01 Jul 2022 06:10 IST

మరో రెండు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో మూడు ప్రభుత్వరంగ సంస్థలకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ఆహార సంస్థ (టీఎస్‌ ఫుడ్స్‌) ఛైర్మన్‌గా మేడె రాజీవ్‌సాగర్‌, రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా మహమ్మద్‌ ఖాజా ముజీబుద్దీన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ పదవీ కాలం మూడు సంవత్సరాలు కాగా... అధికార భాషా సంఘం, ఆహార సంస్థల ఛైర్‌పర్సన్లు రెండేళ్ల పాటు పదవుల్లో ఉంటారు. ఉర్దూ అకాడమీకి మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా నియమితులయ్యారు. కొత్త ఛైర్మన్లకు జీతభత్యాలు, సిబ్బంది, వాహనం, వసతి సౌకర్యాలు ఆయా శాఖలు కల్పించాలని ప్రభుత్వం సూచించింది.


కొత్త ఛైర్మన్ల నేపథ్యం

రాజీవ్‌సాగర్‌

టీఎస్‌ఫుడ్స్‌ ఛైర్మన్‌ మేడె రాజీవ్‌సాగర్‌ ఎమ్మెస్సీ చదివారు. తెలంగాణ జాగృతి సంస్థ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాచీన చరిత్రను వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు. నల్లమల అడవుల, చెంచుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించారు.


మహమ్మద్‌ ఖాజా ముజీబుద్దీన్‌

మహమ్మద్‌ ఖాజా ముజీబుద్దీన్‌ న్యాయవాది, తెరాస కామారెడ్డి జిల్లా అధ్యక్షులు. గతంలో పురపాలక కౌన్సిలర్‌గా, నిజామాబాద్‌ డీసీఎమ్మెస్‌ ఛైర్మన్‌గా,  తెరాస మైనారిటీ సెల్‌ అధ్యక్షునిగా వ్యవహరించారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.


మంత్రి శ్రీదేవి

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన మంత్రి శ్రీదేవి పట్టభద్రురాలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆమె 2004లో తెరాసలో చేరారు. తెలంగాణ భాషా సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. తెలంగాణ భాష, యాస ఔన్నత్యాన్ని పలు వేదికలపై చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని