ఇక నుంచి నిర్ణీత సమయానికే వేతనాలు

వైద్య ఆరోగ్యశాఖలో హౌజ్‌సర్జన్లు, జూనియర్‌ వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల ఉపకార వేతనాలతో పాటు ఆహార, పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, నర్సులందరికీ కూడా ఇక నుంచి నిర్ణీత సమయానికే వేతనాలు అందించేలా

Published : 01 Jul 2022 06:10 IST

 ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని వైద్య మంత్రి ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో హౌజ్‌సర్జన్లు, జూనియర్‌ వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల ఉపకార వేతనాలతో పాటు ఆహార, పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, నర్సులందరికీ కూడా ఇక నుంచి నిర్ణీత సమయానికే వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నివారించడానికి వైద్య మంత్రి గురువారం బీఆర్‌కే భవన్‌లో ఆర్థిక, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య శాఖలో ముఖ్యంగా ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి, హౌజ్‌సర్జన్లు, సీనియర్‌ రెసిడెంట్లకు నెలనెలా వేతనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం వేతనాలకు సంబంధించిన బిల్లుల దస్త్రాన్ని రూపొందించడం.. ఆ బిల్లులకు తనిఖీలు నిర్వహించడం.. ఉన్నతాధికారులకు పంపించడం.. ప్రభుత్వ ఆమోదం పొందడం.. తదితర పద్ధతులన్నీ ఆన్‌లైన్‌లో జరగడం లేదు. దీంతో అనుమతులు పొందడానికి తీవ్ర జాప్యం జరుగుతోందని వైద్యశాఖ గుర్తించింది. దీన్ని నివారించడానికి ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌ విధానాన్నే అనుసరించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం తక్షణమే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమల్లోకి తీసుకురావాలన్నారు. ఆర్థిక, ఆరోగ్యశాఖలు పరస్పరం సమన్వయం చేసుకొని ఇక నుంచి ఏ నెల వేతనాలు అదే నెల అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమంలో మంత్రికి నివారణ చర్యలపై వివరించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతామహంతి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని