Updated : 02 Jul 2022 06:55 IST

విద్వేషం.. విభజనే భాజపా ఎజెండా

అబద్ధాల పునాదులపై మోదీ పాలన
మీరు ఊతమివ్వకున్నా ప్రగతి సాధించాం
తెలంగాణను చూసైనా నేర్చుకోండి
కొత్త ఆరంభానికి మీకు ఇదే సరైన వేదిక
అంతరాలు లేని సమాజం కోసం ఆలోచించండి
ప్రధానమంత్రికి కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నిర్వహించబోతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసలైన ఎజెండా విద్వేషం,  అసలు సిద్ధాంతం విభజనేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అస్తవ్యస్త విధానాలు, అబద్ధాల పునాదులపై అసమర్థ పాలన సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇక్కడా ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ప్రధానికి బహిరంగలేఖ రాశారు. సంకుచితత్వాన్ని డీఎన్‌ఏలోనే నింపుకొన్న భాజపా సమావేశాల్లో.. ప్రజలకు పనికొచ్చే విషయాలను చర్చిస్తారనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని విడదీసే దుర్మార్గ రాజకీయాల చుట్టూనే చర్చలు సాగుతాయని భావిస్తున్నామన్నారు. సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నామని, ఇక్కడి సంస్కృతిని నేర్చుకోవాలని సూచించారు. ఇక్కడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్‌ను గుండెల నిండా నింపుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలను అధ్యయనం చేయాలని, డబుల్‌ ఇంజిన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న భాజపా పాలిత రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు యత్నించాలన్నారు. మత సామరస్యంతో కూడిన వసుధైక కుటుంబం వంటి సమాజం కోసం కొత్త ఆరంభం వైపు అడుగులు వేయాలని సూచించారు.

తెలంగాణతనాన్ని తెలుసుకోండి

‘తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా మారి అద్భుతమైన అభివృద్ధితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న హైదరాబాద్‌.. ప్రపంచ పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను, దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది. భాజపా పాలిత రాష్ట్రాల్లో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయి. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి మీ పార్టీ ఎన్నడూ చేరుకోలేదని అందరికీ తెలుసు. మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్‌లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాస్త తెలంగాణతనాన్ని నేర్చుకోవాలి. తెలంగాణ కోటి రతనాల వీణ. సబ్బండ వర్గాల సమాహారం. ఆతిథ్యానికి, ఆదరణకు, ప్రేమాభిమానాలకు ప్రతీక. వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోంది. మీ విధానాలను మార్చుకుంటారో.. మిమ్మల్ని మీరే మభ్యపెట్టుకుంటారో మీ ఇష్టం.

మీ వెన్నుపోటును మరిచిపోం

‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన మీరు ఈ గడ్డ బాగు కోరుతారని ఎవరూ భావించడంలేదు. సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్‌ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత మరిచిపోదు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామనుకున్న మీ నికృష్ట రాజకీయాలకు మా పనితీరుతోనే జవాబు చెప్పాం. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను మూడు రెట్లు పెంచి.. రూ.1.83 లక్షల కోట్లకు చేర్చాం. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను ఇవ్వకుండా వంచించిన చరిత్ర మీది. మీరు జాతీయ హోదా ఇవ్వకున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. నీతి ఆయోగ్‌ చెప్పినా మీరు పైసా ఇవ్వలేదు. అయినా మిషన్‌ భగీరథ, కాకతీయలను పూర్తి చేశాం. మా పల్లె, పట్టణ ప్రగతి పథకాలు దేశానికి ఆదర్శం. మీరు ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వకున్నా.. గురుకులాలు, వైద్యకళాశాలలను పెద్దఎత్తున విస్తరించాం. మేం చేయని అభివృద్ధి అంటూ ఏమీ లేదు. మీ రాష్ట్రపతి అభ్యర్థిని స్వగ్రామంలో విద్యుత్తు లేదు. కానీ తెలంగాణలో అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్తు ఇస్తున్నాం. మీ పాలనలో ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. వంటగ్యాస్‌ సిలిండర్‌కు ప్రపంచంలోనే అత్యధిక ధర మనదేశంలో ఉంది. సామాన్యుడికి అందుబాటులో లేని నిత్యావసరాలు, పెట్రో ధరలపై దమ్ముంటే ఈ సమావేశాల్లో చర్చించండి. సంక్షేమానికి సరికొత్త అర్థాన్నిచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణ లక్ష్మి వంటి 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలి.

దమ్‌ బిర్యానీ తినండి

హైదరాబాద్‌లో సంప్రదాయ దమ్‌ బిర్యానీ రుచి చూడండి. ఇరానీ చాయ్‌ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచించండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి’ అంటూ కేటీఆర్‌ తన లేఖలో కోరారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని