నుపుర్‌శర్మ దేశాన్ని రెచ్చగొట్టారు

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ..

Published : 02 Jul 2022 07:11 IST

నోటి దురుసుతో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
ఆ కారణంగానే దేశమంతా ఆగ్రహాగ్ని
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సస్పెండైన భాజపా నేతపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

దిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. తనపై వివిధ రాష్ట్రాల్లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్‌శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భాజపా అధికార ప్రతినిధిగా ఆమె ఓ టీవీ చర్చలో మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పర్దీవాలాల ధర్మాసనం తీవ్రంగా గర్హించింది. ‘‘ఆమె నోటిదురుసుతో టీవీలో అన్నిరకాలైన బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసి దేశంలో మంటలు సృష్టించారు. తాను చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పి ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. అయినా అలాంటి మాటలు అనాల్సిన అవసరం ఏముంది..? ఈ వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘటనలు జరగడానికి కారణమయ్యాయి. ఇలాంటి వ్యక్తులకు మతాలపై గౌరవం ఉండదు. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండా కోసం లేదా నీచ కార్యకలాపాల కోసం ఏమైనా చేస్తారు’’ అని తీవ్రంగా ఆక్షేపించింది. ఇస్లాంను అవమానపరిచారని ఉదయ్‌పుర్‌లో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన నేపథ్యంలో న్యాయస్థానం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. నుపుర్‌శర్మ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమె తరఫు న్యాయవాది మణిందర్‌సింగ్‌ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఆమెకు ముప్పు ఉందా.. ఆమెతో దేశ భద్రతకు ముప్పు ఉందా’’ అని ప్రశ్నించింది. ‘‘మేం కూడా టీవీలో చర్చను చూశాం. ఆమె భావోద్వేగాలు తీవ్రంగా రెచ్చగొట్టారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమెదే ఏకైక బాధ్యత’’ అని పేర్కొంది. జరిగిన సంఘటనకు నుపుర్‌ లిఖితపూర్వక క్షమాపణ చెప్పారని మణిందర్‌ సింగ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని న్యాయమూర్తులు అంగీకరించలేదు. ‘‘షరతులతో ఆమె చేసిన దాన్ని క్షమాపణ అంటారా.. ఆమె టీవీలో దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి’’ అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఒకటిగా చేయాలంటూ నుపుర్‌ వేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.

అధికార ప్రతినిధి అయితే ఏమైనా అనొచ్చా..!

నుపుర్‌.. భాజపా అధికార ప్రతినిధిగా చర్చలో స్పందించారని, ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదంటూ మణిందర్‌సింగ్‌ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది.‘‘ పార్టీ అధికార ప్రతినిధి అయితే ఏమైనా మాట్లాడటానికి లైసెన్సు ఇచ్చినట్లా. ఒక వేళ చర్చ పక్కతోవ పట్టి ఉంటే అందుకు కారణమైన యాంకర్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలి’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గతంలో పాత్రికేయుడు అర్ణబ్‌గోస్వామి కేసులో ఎఫ్‌ఐఆర్‌లను కలిపే అవకాశం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిందని, ఒకే చర్యకు రెండో ఎఫ్‌ఐఆర్‌ ఉండకూడదని పేర్కొందని మణిందర్‌ సింగ్‌ చేసిన వాదనలపై జస్టిస్‌ సూర్యకాంత్‌ ఏకీభవించలేదు. ‘‘అది ఒక నిర్దిష్ట సమస్యపై ఒక పాత్రికేయుడి హక్కులకు సంబంధించిన అంశం. దానికీ ఓ పార్టీ అధికార ప్రతినిధి చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకూ సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. నుపుర్‌శర్మ పిటిషన్‌ను విచారించలేమని, హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది. నుపుర్‌శర్మపై దిల్లీలో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘ఇప్పటివరకు ఆమెపై విచారణ ఎంతవరకు వచ్చింది. దిల్లీ పోలీసులేం చేశారు. ఆ విషయాలు మాతో చెప్పించకండి. వారు మీకు ఎర్రతివాచీ పరిచి ఉంటారు’’ అని ధర్మాసనం తెలిపింది. మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దిల్లీ పోలీసులు శుక్రవారం నుపుర్‌శర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

భాజపా సిగ్గుతో తలదించుకోవాలి: కాంగ్రెస్‌

నుపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలను విపక్షాలు స్వాగతించాయి. ఈ వ్యాఖ్యలు చూసైనా అధికార పార్టీ సిగ్గుతో తలదించుకోవాలని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఎన్డీయే ప్రభుత్వం దేశంలో విద్వేష వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత రాహుల్‌గాంధీ అన్నారు. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలకు మోదీ, అమిత్‌షా, భాజపా, ఆరెస్సెస్‌ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. శుక్రవారం రాహుల్‌.. కేరళలోని తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో కొన్ని రోజుల క్రితం ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన పార్టీ కార్యాలయాన్ని  సందర్శించారు. నుపుర్‌శర్మను తక్షణమే అరెస్టు చేయాలని ఏఐఎంఐఎం అధిపతి అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు ప్రకారం.. ఈ విద్వేష వాతావరణానికి కారణం నుపుర్‌శర్మ అని ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు నుపుర్‌శర్మ పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు దిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త అజయ్‌ గౌతమ్‌ లేఖ రాశారు. ఈ లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు.


దేశ పరిస్థితి చూసి భయపడుతున్నా: అమర్త్యసేన్‌

కోల్‌కతా: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సాల్ట్‌లేక్‌ ప్రాంతంలో అమర్త్య పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఏ విషయం గురించి అయినా భయపడుతున్నారా అని నన్ను అడిగితే.. అవును అంటాను. ఇప్పుడు భయపడటానికి కారణం ఉంది. దేశంలో ప్రస్తుత పరిస్థితే ఈ భయానికి కారణం. దేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటాను. చరిత్రపరంగా ఉదారవాద దేశమైన భారత్‌లో విభజనలు రావాలని కోరుకోవడం లేదు. అందరూ కలిసి సమైక్యంగా పని చేయాలి’’ అని సేన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని