విజయ సంకల్ప సభకు భారీ భద్రత

ప్రధాని మోదీ విజయ సంకల్పసభ అనంతరం ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. సభ నిర్వహించే పరేడ్‌

Published : 02 Jul 2022 04:15 IST

ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రధాని బస
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌, కార్ఖానా: ప్రధాని మోదీ విజయ సంకల్పసభ అనంతరం ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. సభ నిర్వహించే పరేడ్‌ మైదానంలో శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారని, హెచ్‌ఐసీసీలో జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారని వివరించారు. పరేడ్‌ మైదానం, బేగంపేట విమానాశ్రయం, రాజ్‌భవన్‌ పరిసరాలు, హెచ్‌ఐసీసీ నుంచి పరేడ్‌ మైదానం వరకు రూట్‌ బందోబస్తు నిర్వహణకు 7వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు.

హెచ్‌ఐసీసీ ప్రాంగణం ఖాకీమయం

మరోవైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణం ఖాకీమయమైంది. సభకు హాజరవుతున్న ప్రధాని, ఇతర ప్రముఖులకు వేరువేరుగా వాహనాల కాన్వాయ్‌తో ముందస్తుగా నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజనింగ్‌ (ఏఎస్‌ఎల్‌)ల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు సైరన్‌ మోతలతో మారుమోగుతున్నాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులూ తలెత్తుతున్నాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు బస చేసేందుకు కేటాయించిన వెస్టిన్‌, ట్రైటెండ్‌, తాజ్‌కృష్ణ హోటళ్ల వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉండే హోటళ్ల వద్ద అదనపు బలగాలను దించారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఆంక్షలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే పోలీసు ఉన్నతాధికారులనూ తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసుశాఖ ఆక్టోపస్‌ కమెండోలను మోహరించింది. దీంతోపాటు సీఆర్‌పీఎఫ్‌ నుంచి కొంతమంది రంగంలోకి దిగారు. వీరు కాకుండా వీఐపీ భద్రతలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐ.ఎస్‌.డబ్ల్యూ.) సిబ్బంది పెద్దసంఖ్యలో విధుల్లో పాల్గొంటున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు.

బ్రాంటో స్కైలిఫ్ట్‌

అగ్నిమాపక శాఖలో కీలకమైన బ్రాంటో స్కైలిఫ్ట్‌ వాహనాన్ని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నోవాటెల్‌ హోటల్‌లో రెండ్రోజులపాటు ప్రముఖులు బస చేయనుండటంతో ఈ వాహనాన్ని అక్కడే మోహరించారు. అగ్నిప్రమాదం సంభవిస్తే మంటల్ని వెంటనే అదుపు చేసేందుకు 10 మల్టీపర్పస్‌ టెండర్లు(ఎంపీటీ), 3 వాటర్‌ టెండర్లు, 2 వాటర్‌ కమ్‌ ఫోమ్‌ టెండర్‌, 2 మిస్ట్‌ బుల్లెట్లు, 6 అడ్వాన్స్‌ వాటర్‌ టెండర్లు అందుబాటులో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని