ప్రధాని రాక సందర్భంగా ముందస్తు అరెస్టులు

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా, ఎమ్మార్పీఎస్‌, తదితర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అదుపులోకి

Published : 02 Jul 2022 06:36 IST

ఖండించిన పార్టీలు, ప్రజాసంఘాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా, ఎమ్మార్పీఎస్‌, తదితర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులను మొత్తం 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులను సంగారెడ్డిలో 10 మందిని, మెదక్‌లో 29మందిని ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుని ఆ పార్టీ నేతలు ఖండించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సీపీఎం, ఇతర ప్రజాసంఘాలకు చెందిన ఏడుగురు కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వీరిని అలంపూర్‌, ఉండవెల్లి, వడ్డేపల్లి, గట్టు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అరెస్టు చేశారని, మోదీ రాక సందర్భంగా ఇలాంటి అక్రమ అరెస్టులకు పూనుకోవడం గర్హనీయమని ఆయన విమర్శించారు. సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా నాయకులు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌ను పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి నిజామాబాద్‌లో గృహ నిర్బంధంలో ఉంచారు. దీన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు. హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే.. నిజామాబాద్‌లో అరెస్టులు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభాకర్‌పై నిర్బంధాన్ని ఆపాలని, పోలీసులను వెంటనే ఆయన ఇంటి వద్ద నుంచి ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని