జీఎస్టీ వసూళ్లలో 56% వృద్ధి

జీఎస్టీ ద్వారా జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,44,616 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది 56% అధికమని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలైన

Published : 02 Jul 2022 06:36 IST

జూన్‌లో రూ.1,44,616 కోట్ల వసూళ్లు
ఏప్రిల్‌ తర్వాత అత్యధికం ఇదే
తెలంగాణలో 37%, ఏపీలో 46% వృద్ధి

ఈనాడు, దిల్లీ: జీఎస్టీ ద్వారా జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,44,616 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది 56% అధికమని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలైన రూ.1,67,540 కోట్ల తర్వాత ఒక నెలలో వసూలైన గరిష్ఠ మొత్తం ఇదేనని పేర్కొంది. జూన్‌లో వసూలైన మొత్తంలో సీజీఎస్టీ కింద రూ.25,306 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.32,406 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.75,887 కోట్లు (ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వచ్చిన మొత్తం రూ.40,102 కోట్లు), సెస్‌ కింద రూ.11,018 కోట్లు (ఇందులో దిగుమతి వస్తువులపై రూ.1,197 కోట్లు) ఉంది. ఇందులో కేంద్రప్రభుత్వం సీజీఎస్టీ కింద రూ.29,588 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.24,235 కోట్లు పంపిణీ చేసింది. ఐజీఎస్టీ కింద తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 50:50 నిష్పత్తిలో రూ.27 వేల కోట్లను పంచింది. గత ఏడాది జూన్‌లో కరోనా రెండో దశ తీవ్రంగా ఉండటంతో వసూళ్లు రూ.92,800 కోట్లకే పరిమితమయ్యాయి. దాంతో పోలిస్తే ఈ జూన్‌లో ఆదాయం 56% పెరిగింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటడం ఇది అయిదోసారి. ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, నకిలీ బిల్లులను అరికట్టడంతో వసూళ్లు పెరిగినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక సెస్‌ జూన్‌ నెలలోనే వసూలైనట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని