ఎమ్మార్వో నోటీసులను రద్దు చేయండి

ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ మే 6, జూన్‌ 25న మాసాయిపేట ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ జమునా హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి, రాజేందర్‌ భార్య జమున

Published : 02 Jul 2022 06:34 IST

హైకోర్టును ఆశ్రయించిన జమునా హేచరీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ మే 6, జూన్‌ 25న మాసాయిపేట ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ జమునా హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి, రాజేందర్‌ భార్య జమున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్‌ గ్రామం సర్వే నం.130లోని భూమిని నితిన్‌రెడ్డి కొనుగోలు చేశారన్నారు. ఇందులోని 18.35 ఎకరాల భూమికి సంబంధించి 2017లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేపట్టి అందులోని 3 ఎకరాలను కె.సత్యనారాయణరావు పేరుతో రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారన్నారు. ఈ ఉత్తర్వులను ఎమ్మార్వో 2018లో అమలు చేశారని, అనంతరం నితిన్‌రెడ్డి ఆ భూమిని సత్యనారాయణరావు నుంచి కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సర్వే నంబరులోని మొత్తం భూమిని ప్రభుత్వం 1995లో ల్యాండ్‌ సీలింగ్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేసి స్వాధీనం చేసుకుందన్నారు. భూమిలేని పేదల కోసం దీన్ని ఎసైన్‌ చేసిందని, ఎసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. మూడెకరాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను కాకుండా అన్నింటిని సవాల్‌ చేయడం చెల్లదన్నారు. పిటిషనర్‌ న్యాయవాది స్పందిస్తూ గతేడాది ఇలాంటి నోటీసులపై హైకోర్టును ఆశ్రయించామని, పిటిషనర్‌ అభ్యంతరాలను వ్యక్తిగతంగా వినాలని న్యాయమూర్తి ఆదేశించారన్నారు. సర్వే చేస్తున్నట్లు అప్పట్లో ఏజీ చెప్పారని, తన భూమి ఏదో తెలియకుండా ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని