తెల్లకోటు.. సేవకు లేదు లోటు

ప్రైవేటు వైద్యులంతా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. జగిత్యాల జిల్లాకు చెందిన బండారి నరేందర్‌రావు మాత్రం అందుకు భిన్నం. మానవతా దృక్పథంతో వైద్యం అందించడంతోపాటు..అనేక

Updated : 02 Jul 2022 07:03 IST

కరీంనగర్‌ వైద్యుని సామాజిక స్పృహ
బీఎన్‌రావు ఫౌండేషన్‌ ద్వారా ఆపన్నులకు ఆసరా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు వైద్యులంతా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. జగిత్యాల జిల్లాకు చెందిన బండారి నరేందర్‌రావు మాత్రం అందుకు భిన్నం. మానవతా దృక్పథంతో వైద్యం అందించడంతోపాటు..అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నారీయన. చేసిన సేవలకుగానూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నుంచి పురస్కారాన్నీ పొందారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వాసి బండారి నరేందర్‌రావు ఉస్మానియాలో ఎంబీబీఎస్‌, పీజీ పూర్తిచేశారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులతోపాటు నిమ్స్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలం సౌదీలో పనిచేసి తిరిగొచ్చారు. రుమటాలజీ వైద్య నిపుణుడైన ఆయన 2005లో కరీంనగర్‌లో ఆసుపత్రి నెలకొల్పి రోగులకు తక్కువ రుసుంతో వైద్యం అందించారు. 2017లో బీఎన్‌రావు హెల్త్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి, దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. సేవలను గుర్తించిన ఐఎంఏ ఆయనకు ఈ ఏడాది ఏప్రిల్‌లో జాతీయ సామాజిక సేవ పురస్కారం ప్రదానం చేసింది. ‘ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి చేరుకున్నా. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిపెరగడంతో పేదల సమస్యలు తెలుసు. వారికి అండగా ఉండాలనే మొదట్నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని’ ఈ సందర్భంగా నరేందర్‌రావు తెలిపారు.

సేవా కార్యక్రమాలు ఇలా..

ప్రభుత్వ పాఠశాలల్లో రక్తహీనత సహా ఇతర సమస్యలతో బాధపడే విద్యార్థినులను గుర్తించేందుకు 100కిపైగా వైద్యశిబిరాల నిర్వహణ. అవసరమైన వారికి మాత్రలు, ఔషధాల పంపిణీ.

కరోనా సమయంలో ప్రజలు, వైద్యఆరోగ్య, పురపాలక సిబ్బంది, పోలీసులు, విద్యార్థులు కలిపి రెండు లక్షల మందికి మాస్కులు, శానిటైజర్లు, జింకోవిట్‌ మాత్రల పంపిణీ.

మహిళల కోసం కరీంనగర్‌, సిద్దిపేటల్లో ఉచిత కేన్సర్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ.

నడవలేని స్థితిలో ఉన్న పేదలకు సొంత ఖర్చుతో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు.

సంపాదించే వ్యక్తులు చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థికసాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని