Published : 02 Jul 2022 06:41 IST

‘మిగులు జలాల’ గణనకు సరే

ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన రెండు రాష్ట్రాలు
ప్రతి చుక్కా లెక్కించాల్సిందేన్న తెలంగాణ
కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ మూడో సమావేశం
నెలాఖరులో మరో భేటీకి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండి దిగువకు ప్రవహించే (స్పిల్‌ ఓవర్‌) నీటి వినియోగానికి సంబంధించి లెక్కలు చేపట్టేందుకు జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. కమిటీ కన్వీనర్‌, కృష్ణాబోర్డు సభ్యుడు రవికుమార్‌ పిళ్లై అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్‌ఎంసీ మూడో సమావేశం జరిగింది. ఇందులో కమిటీ సభ్యులైన తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్‌కో సీఈలు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టులు నిండి దిగువకు ప్రవహించే జలాలపై చర్చ చోటుచేసుకుంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు నిండి సముద్రం పాలవుతున్న నీటిని రెండు రాష్ట్రాలు సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలనేది తమ అభిప్రాయమని ఏపీ పేర్కొంది. కేటాయింపుల్లో ఆ నీటిని చూపకుండా ఉండాలని, దిగువ రాష్ట్రమైన తమకు వినియోగానికి హక్కు ఉందని ఏపీ తెలిపింది. నీటి వినియోగించుకున్నా ఎంతమేరకు వాడుకున్నది లెక్కించాల్సిందేనని తెలంగాణ సూచించింది. జలగణనకు తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. కృష్ణాబోర్డు నీటి వినియోగ లెక్కలను తప్పకుండా చేపడుతుందని పిళ్లై తెలిపారు. ఈ నెలాఖరున నాలుగో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది.

శ్రీశైలంలో రివర్స్‌ పంపింగ్‌పై ఏపీ దృష్టి

శ్రీశైలంలో నీటిమట్టం కనిష్ఠస్థాయికి పడిపోయినప్పుడు ఆనకట్ట దిగువన నిల్వ ఉండే నీటిని టార్బైన్లను వెనక్కు తిప్పడం ద్వారా జలాశయంలోకి తెలంగాణ ఎత్తిపోసుకుంటోంది. ఆ నీటిని కల్వకుర్తి ఎత్తిపోతల కింద తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటోంది. శ్రీశైలం కింద గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు తాము కూడా ఆ విధానాన్ని వినియోగించుకుంటామంటూ ఆర్‌ఎంసీ సమావేశంలో ఏపీ ఏకరవు పెట్టింది. తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరింది. ఇది ప్రభుత్వాల స్థాయిలో చర్చ జరగాల్సిన విషయమని తెలంగాణ సూచించింది.


ఆర్‌ఎంసీలో తేలకపోతే బోర్డు ముందుకు

-మురళీధర్‌, ఈఎన్‌సీ, నీటిపారుదల శాఖ, తెలంగాణ

ర్‌ఎంసీ ముందు రాష్ట్ర అభిప్రాయాలను నమోదు చేశాం. స్పిల్‌ ఓవర్‌ జలాలను లెక్కగట్టాలని కోరాం.  ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే ఏపీకి నీళ్లు వెళ్తాయి. అందుకే వాళ్లు ఎంతైనా వినియోగించుకుందాం అంటారు.  తెలంగాణకు లిఫ్టుల ద్వారా ఎత్తిపోసుకోవాల్సిందే కదా. శ్రీశైలం రివర్స్‌ పంపింగ్‌ విధానాన్ని తామూ వాడుకుంటామని ఏపీ కోరుతున్నా.. అది రెండు ప్రభుత్వాలు చర్చించి తీసుకోవాల్సి నిర్ణయం. రూల్‌కర్వ్స్‌, ఇతర అంశాలపై తెలంగాణ అభిప్రాయాలు తెలియజేస్తాం. మరో రెండు సమావేశాలు జరగనున్నాయి. తుది నివేదికలో మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోతే కృష్ణా బోర్డు ముందుకు వెళ్తాం.


మొత్తం 3 అంశాలపైనా అభిప్రాయాలు చెప్పాం
- నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ, ఏపీ

ప్రస్తుత సమావేశంలో స్పిల్‌ ఓవర్‌ నీటిపై ఏపీ అభిప్రాయం నమోదు చేశాం. ట్రైబ్యునల్‌ అవార్డు మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టుల నుంచి పొంగిపొర్లే నీటిని ఏ రాష్ట్రమైనా వారి అవసరాలకు తీసుకోవచ్చు. అది కోటా కింద రాదు. మేం దిగువ రాష్ట్రం అయినందున వినియోగించుకుంటున్నాం. తెలంగాణను మేం వినియోగించుకోవద్దని చెప్పడం లేదు. వినియోగంపై డేటాబేస్‌ రూపకల్పనకు మేం అంగీకరించాం. ఈ ఏడాది ప్రొటోకాల్స్‌ మేరకు కృష్ణాబోర్డు రిజర్వాయర్లను నిర్వహిస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం. చెన్నై నగర తాగునీటికి శ్రీశైలంలో ఎండీడీఎల్‌ 854 అడుగుల స్థాయి మట్టాన్ని కొనసాగించాలని గతంలోనే నిర్ణయించారు. విద్యుత్‌ అవసరాలకు అంతకన్నా దిగువ నుంచి నీటిని నిబంధనల మేరకు సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే తీసుకోవచ్చు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని