ధాన్యం... పురుగులకు ఫలహారం

రాష్ట్రంలోని మిల్లుల్లో ఉన్న ధాన్యం పురుగుల పరం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం రగడతో పురుగులకు  ఆహారానికి లోటు లేకుండా పోయింది. మూడు సీజన్లకు సంబంధించిన ధాన్యం మిల్లుల్లో పేరుకుపోయింది. దానికి కొక్కు పురుగు పట్టింది.

Published : 03 Jul 2022 03:41 IST

వడ్ల నిల్వలకు కొక్కు పురుగు
ఆందోళనలో మిల్లర్లు
రానున్న మూడు నెలల్లో 90 లక్షల టన్నుల రాక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మిల్లుల్లో ఉన్న ధాన్యం పురుగుల పరం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం రగడతో పురుగులకు  ఆహారానికి లోటు లేకుండా పోయింది. మూడు సీజన్లకు సంబంధించిన ధాన్యం మిల్లుల్లో పేరుకుపోయింది. దానికి కొక్కు పురుగు పట్టింది. ఇది ధాన్యంలో త్వరితంగా విస్తరిస్తుందన్న ఆందోళన మిల్లర్ల నుంచి వ్యక్తం అవుతోంది. 2021-22 సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన 88.52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో ఉంది. మిల్లింగ్‌ చేయటం ద్వారా 58.08 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోవాల్సి ఉంది. మరో మూడు నెలల్లో మళ్లీ 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు వస్తాయని అంచనా. ఇంతపెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు ఉంటే పురుగు పట్టే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఇప్పటికే సిద్ధమైన బియ్యం కూడా వాటి పరం అవుతాయి.

ధాన్యం సేకరణ ఎప్పుడు?

ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవటంతోపాటు ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోలేదంటూ జూన్‌ ఏడు నుంచి బియ్యం సేకరణను కేంద్రం నిలుపుదల చేసింది. తర్వాత ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. అయినప్పటికీ కేంద్రం ధాన్యం సేకరణను తిరిగి ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు.

ఇప్పుడేమి చేద్దాం?

కేంద్రం ఇలానే తాత్సారం చేస్తే ఏమి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అంతుచిక్కడం లేదు. న్యాయపోరాటం కోసం నిపుణులతో సంప్రదింపులు నిర్వహించటంతోపాటు ధాన్యాన్ని వేలం వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలపై మేధోమథనం సాగుతూనే ఉంది.  సోమవారంలోగా ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఉత్తర్వులు జారీ కాని పక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తుది నిర్ణయం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని