సంక్షిప్త వార్తలు

తెలంగాణ టీఈటీ(పేపర్‌-1)లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. ఆమెకు మొత్తం 133 మార్కులు వచ్చాయి.

Published : 03 Jul 2022 04:24 IST

టెట్‌లో ప్రకాశం యువతికి తొలి ర్యాంకు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: తెలంగాణ టీఈటీ(పేపర్‌-1)లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. ఆమెకు మొత్తం 133 మార్కులు వచ్చాయి.


సమ్మె విరమించిన డాక్టర్ల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: సమ్మె విరమిస్తున్నట్లు సీనియర్‌ రెసిడెంట్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నుంచి పూర్తిస్థాయి హామీ వచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొంది.


516 మందికి కరోనా పాజిటివ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 516 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం 26,976 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 631 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. శనివారం 434 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రాష్ట్రంలో రికవరీ రేటు 98.89 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.  


జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గత నెల జూన్‌ 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ(జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌) మెయిన్‌ మొదటి విడత పేపర్‌-1, 2 పరీక్షల ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం రాత్రి వెబ్‌సైట్లో విడుదల చేసింది. కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది. అందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ.200లు వంతున చెల్లించాలని ఎన్‌టీఏ పేర్కొంది.


‘ఆదర్శ’లో ఇంటర్‌ దరఖాస్తుకు తుదిగడువు 10

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని మోడల్‌ స్కూల్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉషారాణి శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను www.tsmodelschools.com వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలన్నారు.


‘మూడు నెలలుగా జీతాలు లేవు’

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సగం జిల్లాలకు చెందిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల వేతనాలు అందలేదని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌, అధికార ప్రతినిధి సయ్యద్‌ జబీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు మంజూరు చేయాలని వారు కోరారు.


అదనపు ముఖ్య ఎన్నికల అధికారిగా మాణిక్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో)గా మాణిక్‌రాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అదనపు సీఈవోగా ఉన్న బుద్ధ ప్రకాష్‌ను ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. బుద్ధ ప్రకాష్‌ నుంచి మాణిక్‌రాజ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని